Begin typing your search above and press return to search.

మారేడుప‌ల్లిలో 'కేటీఆర్‌-ఇవాంకా ట్రంప్ రోడ్'

By:  Tupaki Desk   |   1 May 2018 1:16 PM GMT
మారేడుప‌ల్లిలో కేటీఆర్‌-ఇవాంకా ట్రంప్ రోడ్
X
కొద్ది నెల‌ల క్రితం హైద‌రాబాద్ లో జ‌రిగిన `గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్` కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఇవాంకా రాక కోసం తెలంగాణ స‌ర్కార్....ఓ రేంజ్ లో బ‌స‌, విందు ఏర్పాట్లు చేసింది. దాంతో పాటు ఆమె ప్ర‌యాణిస్తున్న ప‌లు మార్గాల్లో రోడ్ల‌న్నీ త‌ళ‌త‌ళ మెరిసేలా మ‌ర‌మ్మ‌తులు చేయించింది. కొన్ని చోట్లయితే...ఏకంగా కొత్త రోడ్లు కూడా వేయించింది. దీంతో, త‌మ ప్రాంతంలో కూడా రోడ్లు న‌ర‌కానికి కేరాఫ్ అడ్ర‌స్ గా ఉన్నాయ‌ని...త‌మ రూట్ లో ఇవాంకా ఒక్క‌సారి ప్ర‌యాణిస్తే బాగుండ‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. దాంతో పాటే - జీహెచ్ఎంసీకి కూడా రోడ్లు మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని పలువురు విజ్ఞప్తులు కూడా చేశారు. అయిన‌ప్ప‌టికీ ఎటువంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో మారేడిప‌ల్లి వాసులు వినూత్న త‌ర‌హాలో త‌మ నిర‌స‌న తెలిపారు. స్వ‌చ్ఛందంగా స్థానికులంతా క‌లిసి త‌మ రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తు చేసుకోవ‌డ‌మే కాకుండా....ఏకంగా ఆ రోడ్డుకు`కేటీఆర్‌-ఇవాంకా ట్రంప్ రోడ్` అని నామ‌క‌ర‌ణం చేసి సంచ‌ల‌నం రేపారు. ప్ర‌స్తుతం ఆ రోడ్డు మ‌ర‌మ్మ‌తు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఇవాంకా ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో అంద‌రిలాగే మారేడిప‌ల్లి వాసులు కూడా జీహెచ్ ఎంసీకి త‌మ విన్న‌పాలు చేసుకున్నారు. అయితే, వారికి అధికారుల నుంచి .... ఇవాంక మీ ప్రాంతంలోకి రావట్లేదు కదా అంటూ....వెట‌కార‌పు స‌మాధానం వ‌చ్చింది. ఇక వారినీ వీరిని న‌మ్ముకుంటే లాభం లేద‌ని.....ప్రజలే రంగంలోకి దిగారు. మారేడుప‌ల్లి వాసులు స్వచ్ఛందంగా తట్ట బుట్టా ప‌ట్టుకొని మట్టితో రోడ్ల‌పై ఉన్న గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేసుకున్నారు. అంత‌టితో ఆగ‌కుండా....ఆ రోడ్డుకు `కేటీఆర్‌-ఇవాంకా ట్రంప్ రోడ్` అని పేరు పెట్టి త‌మ నిర‌స‌న‌ను వ్యంగ్యాత్మ‌కంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, అధికారుల తీరుకు నిరసనగా తాము ఈ పని చేశామ‌ని వారు అన్నారు. ఆ రోడ్డుకు ‘కేటీఆర్‌-ఇవాంక ట్రంప్‌ రోడ్డు’ అని పేరు పెట్టిన‌ట్లు ఫ్లకార్డులను ప్రదర్శించిన ఫొటోల‌ను ‘మారేడ్‌పల్లి డేస్‌’ ఫేస్‌బుక్‌ పేజీ లో పోస్ట్ చేశారు. దీంతో, ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఇటువంటి ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి చెంప‌పెట్టు అని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ఎవ‌రి పై ఆధార‌ప‌డకుండా మ‌ర‌మ్మ‌తులు చేసుకున్న మారేడుప‌ల్లి వాసుల‌ను మిగ‌తా వారు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని అంటున్నారు.