Begin typing your search above and press return to search.

48 గంటల్లో రూ.కోటి హ్యీపీ సరే! 90 రోజులు పోగొట్టుకున్న మాటేంటి?

By:  Tupaki Desk   |   13 Dec 2020 2:30 AM GMT
48 గంటల్లో రూ.కోటి హ్యీపీ సరే! 90 రోజులు పోగొట్టుకున్న మాటేంటి?
X
పోగొట్టుకోవాల్సినంత పోగొట్టుకొని.. చేతికి వచ్చిన కూసింత మొత్తానికి సంబరపడిపోతే ఏమనాలి? ఇలాంటి పరిస్థితి చిన్నపిల్లాడిలో కనిపిస్తే.. సర్లేనని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే.. దాన్నేమనాలి? తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆనందాన్ని చూసినప్పుడు.. ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఏదో చేయాలనుకోవటం మంచిదే. మార్పు తేవాల్సిన అవసరం ఉంది. అలా అని.. అందుకు కోట్లాది మందిని ఇబ్బందులకు గురి చేయటం ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.

కానీ.. ఇలాంటివేమీ పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 90 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను బంద్ చేయటాన్ని ఏమనాలి? దీని కారణంగా ప్రజలు పడిన ఇబ్బందులు ఒక ఎత్తు అయితే.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా కోల్పోయిందని చెప్పక తప్పదు. హైకోర్టు కల్పించుకొని.. రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పిన తర్వాత కానీ ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్లను షురూ చేసింది.

నిన్నటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేసేందుకు వీలుగా స్లాట్ బుకింగ్ ను అమల్లోకి తేవటం తెలిసిందే. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లను షురూ చేస్తున్న సంగతి తెలిసిందే. స్లాట్ బుకింగ్ ఓపెన్ చేసిన 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.కోటి మొత్తం ఆదాయం రూపంలో వచ్చినట్లుగా సోమేశ్ చెప్పారు. ఈ రోజు సాయంత్రం వరకు 10,509 మంది స్లాట్లు బుక్ చేసుకున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెబుతూ.. 48 గంటల్లో వచ్చిన ఆదాయం గురించి గొప్పగా చెప్పటం చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. రూ.కోటి ఆదాయానికే ఇంత ఆనందపడిపోయే పెద్ద మనిషి.. గడిచిన 90 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు ఆపేసిన కారణంగా రాష్ట్ర సర్కార్ కోల్పోయిన ఆదాయం మాటేమిటంటారు?