Begin typing your search above and press return to search.

తెలంగాణ పోలీసుల ఎన్ కౌంటర్.. ఏపీ టీ బంకులో రోజంతా ఫ్రీ

By:  Tupaki Desk   |   7 Dec 2019 10:38 AM GMT
తెలంగాణ పోలీసుల ఎన్ కౌంటర్.. ఏపీ టీ బంకులో రోజంతా ఫ్రీ
X
దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసుల మీద ఎంతటి ప్రశంసలు.. మెచ్చికోళ్లు వస్తున్నాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒక ప్రాంతంలో పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ కు ప్రాంతాలకు రాష్ట్రాలకు అతీతంగా జాతీయ స్థాయిలో సామాన్య ప్రజల నుంచి ఒకేలాంటి స్పందన రావటం ఇప్పుడు మరో ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఎవరికి వారు తమకు తోచిన రీతిలో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన వైనాన్ని సమర్థిస్తూ.. తమకు తోచిన రీతిలో పండుగ చేసుకోవటం కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పే ఉదంతం ఈ కోవకు చెందినదే. దిశ నిందితుల ఎన్ కౌంటర్ వేళ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన టీ స్టాల్ యజమానిసత్యనారాయణ మూర్తి అనూహ్యంగా రియాక్ట్ అయ్యారు.

ముగ్గురు ఆడపిల్లల తండ్రి అయిన సత్యనారాయణ టీ బంకు విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంటుంది. నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారన్న వార్త తెలిసిన తర్వాత నుంచి తన షాపులో టీ తాగేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా పంపిణీ చేశారు. ఇదేదో గంట.. రెండు గంటలు కాదు.. రోజంతా ఇదే రీతిలో ఉచితంగా పంపిణీ చేయటం గమనార్హం. దారుణ నేరాలకు పాల్పడే నిందితులకు శిక్షలు త్వరగా పడాలన్న కోరిక సామాన్యుల్లో ఎంత బలీయంగా ఉందో ఈ ఉదంతం చెబుతుందని చెప్పక తప్పదు.