Begin typing your search above and press return to search.

గుజరాత్ కు ఉన్నదేంటి?తెలంగాణకు లేనిదేమిటి?

By:  Tupaki Desk   |   29 April 2021 9:30 AM GMT
గుజరాత్ కు ఉన్నదేంటి?తెలంగాణకు లేనిదేమిటి?
X
ఈ దేశంలో గుజరాత్ మాత్రమే రాష్ట్రం కాదన్నది మరచిపోకూడదు. ఆ మాటకు వస్తే అన్ని రాష్ట్రాలు భారత్ దేశంలోనివే అన్నది పాలకులు మరచిపోతున్నారా? అన్నది ప్రశ్నగా మారుతోంది. దీనికి కారణం లేకపోలేదు. కరోనా లాంటి మహమ్మారి జడలు విప్పి చెలరేగిపోతున్నప్పుడు.. రాష్ట్రాలకు అతీతంగా.. రాజకీయాల గురించి ఆలోచించకుండా.. వైరస్ తీవ్రత ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటే.. ఆ రాష్ట్రానికి అమిత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో.. ఆ రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఎఫెక్టు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా కొన్ని రాష్ట్రాలకు పెద్ద పీట వేయటం.. మిగిలిన రాష్ట్రాల్ని పట్టించుకోకపోవటం ఏమాత్రం సరికాదు.

బ్యాడ్ లక్ ఏమంటే.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. కొన్ని రాష్ట్రాలకు అమితమైన ప్రాధాన్యత ఇవ్వటం.. మరికొన్ని రాష్ట్రాల్ని అస్సలు పట్టించుకోవటం ఎక్కువైంది. ఎక్కడిదాకానో ఎందుకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవటం కోసం తహతహలాడుతున్న బీజేపీ.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. బెంగాల్ లోని ప్రతి పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ అందిస్తుందని స్పష్టం చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే. అదే సమయంలో ఈ తాజా హామీ ఇచ్చింది బీజేపీనే. అంటే.. తమకు అధికారాన్ని కట్టబెట్టే రాష్ట్రాల్లో ఒక తీరు.. మిగిలిన రాష్ట్రాల్లో మరో తీరు ఏమిటి? వ్యాక్సిన్ వ్యవహారం మొత్తం తమ చేతుల్లోకి తీసుకున్న కేంద్రం.. దాన్ని కొనసాగించకుండా.. మధ్యలో పాలసీ మార్చటం ఎందుకు? పశ్చిమ బెంగాల్ లో ఏ రీతిలో అయితే అందరికి ఉచితంగా వ్యాక్సిన్ మాట చెప్పారో.. అదే రీతిలో యావత్ దేశం మొత్తం ఉచితంగా టీకా వేస్తామని ఎందుకు ప్రకటించలేదన్నది ప్రశ్న.

ఒక్క వ్యాక్సిన్ విషయంలోనే కాదు.. మిగిలిన చాలా విషయాల్లోనూ ఇలాంటి తీరే కనిపిస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ రోజున రెమిడెసివర్ కొరత తీవ్రంగా ఉంది. అయితే..బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద ఎత్తున రెమిడెసివర్ ఇంజెక్షన్లు సరఫరా చేస్తూ.. మిగిలిన రాష్ట్రాల్ని చిన్నచూపు చూడటం ఎంతవరకు సమంజసం? తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నాలుగు లక్షల ఇంజక్షన్లు అడిగిన పది రోజుల తర్వాత ఇచ్చింది కేవలం 21 వేల ఇంజక్షన్లు మాత్రమేనని అదే సమయంలో.. గుజరాత్ కు మాత్రం 1.63లక్షల ఇంజక్షన్లు పంపటాన్ని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. బీజేపీ పాలిత రాష్ట్రాలు.. అందునా గుజరాత్ కు ఇస్తున్న ప్రాధాన్యత మిగిలిన రాష్ట్రాల ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారని చెప్పక తప్పదు.