Begin typing your search above and press return to search.

పోలీస్ వాహ‌నం మీద హోంమంత్రి మ‌న‌మ‌డు!

By:  Tupaki Desk   |   19 July 2019 4:57 AM GMT
పోలీస్ వాహ‌నం మీద హోంమంత్రి మ‌న‌మ‌డు!
X
యూత్ మొద‌లు వారు.. వీరు అన్న తేడా లేకుండా టిక్ టాక్ ఎంత‌లా ఊపేస్తుందో తెలిసిందే. రోటీన్ కు భిన్నంగా ఉండే వీడియో ఏదైనా స‌రే.. గంట‌ల్లో భారీగా వైర‌ల్ అవుతున్న ఈ యాప్ మీద క్రేజ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ వీడియోల‌తో కొత్త వివాదాలు.. స‌మ‌స్య‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. టిక్ టాక్ వీడియోల‌తో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వైర‌ల్ అవుతున్న టిక్ టాక్ వీడియో ఒక‌టి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌మూద్ అలీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

ఆయ‌న్ను మాత్ర‌మే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్నిఇరుకున పెట్టేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తోంది. ఈ వైర‌ల్ వీడియోలో టీ హోంమంత్రి అలీ మ‌న‌మ‌డితో ఉన్న వైనం ఇప్పుడు వివాదంగా మారింది. హోంమంత్రికి తెలంగాణ ప్ర‌భుత్వం కేటాయించిన పోలీసు వాహ‌నం టీఎస్ 09 పీఏ9999 వాహ‌నం మీద హోంమంత్రి మ‌న‌మ‌డు సుర్ క్వాన్ త‌న స్నేహితుడితో క‌లిసి వాహ‌నం బాయినెట్ మీద కూర్చొన్న తీరు ఒక వివాద‌మైతే.. ఆ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి సంచ‌ల‌నాలే.

ఓ హిందీ సినిమాలో డైలాగ్ ను అనుక‌రిస్తూ.. హోంమంత్రి మ‌న‌మ‌డి స్నేహితుడు డైలాగ్ చెబుతాడు. అరే.. ఏయ్.. ఐజీ..! అరేయ్ బోలేతో గుస్సా ఆగ‌యా? అపున్ కా భాయ్ సే త‌మీజ్ సే బాత్ క‌ర్నేకా .. ఔర్ జ‌రా జ‌బాన్ స‌మాల్ కే పేష్ ఆనేకా. జాదా చ‌లాయేనా.. తో కాట్ కే ర‌క్ దేంగే అన్న డైలాగ్ ను అనుక‌రించ‌టం క‌నిపిస్తుంది.

హోంమంత్రి మ‌న‌మ‌డు అయి ఉండి.. పోలీసు వాహ‌నం మీద కూర్చొని మ‌రీ.. పోలీసుల‌కు వ్య‌తిరేకంగా వీడియో చేట‌మా? అన్న విస్మ‌యం వ్య‌క్త‌మవుతోంది. ఇదిలా ఉంటే.. ఆ వీడియోలో పోలీసు వాహ‌నం ప‌క్క‌న ఒక పోలీసు(?) ఉద్యోగి త‌ల దించుకొని ఉండ‌టం క‌నిపిస్తుంది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలా పోలీసుల ప‌రువును బ‌జారుకు ఈడుస్తారా? అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.