Begin typing your search above and press return to search.

పాస్ పుస్తకంతో కోర్టుకు రండి.. తెలంగాణ హైకోర్టు సీరియస్

By:  Tupaki Desk   |   8 Jun 2023 10:00 AM GMT
పాస్ పుస్తకంతో కోర్టుకు రండి.. తెలంగాణ హైకోర్టు సీరియస్
X
ఒక భూవివాదానికి సంబంధించిన కేసు విచారణ వేళ.. అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం పొందిన తర్వాత కూడా బాధితులకు చుక్కలు చూపిస్తున్న వైనంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది.అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మీదా ఇంత లెక్కలేనితనమా? ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం పొందిన తర్వాత కూడా అధికారులకు జాలి.. దయ లాంటివి ఏమీ ఉండవా? ఇలా అయితే.. సామాన్యుల మాటేమిటి? వారు న్యాయం ఎలా పొందుతారు? అంటూ ప్రశ్నించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

తదుపరి విచారణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. ఆర్డీవో.. గండిపేట తహసీల్దారు భూమికి సంబంధించిన పాస్ పుస్తకంతో కోర్టుకు రావాలని.. దాన్ని పిటిషనర్ కు కోర్టు నేరుగా అందిస్తుందని స్పష్టం చేశారు. తదుపరి వాయిదాకు పాస్ బుక్ తో కానీ రాకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇంతలా టీ హైకోర్టు ఎందుకు సీరియస్ అయ్యింది? అన్న వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ లో ప్రతాప్ జంగిల్ రిసార్టుకు 20 ఎకరాల భూమి ఉంది.

భూములను ధరణిలో అప్ లోడ్ చేయటం.. కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే సమయంలో ఈ భూమి ప్రభుత్వానిది అంటూ రెవెన్యూ అధికారులు వివాదానికి తెర తీశారు. దీనిపై రిసార్టు యాజమాన్యం 2019లో హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారణ జరిపిన సింగ్ జడ్జి.. ఆ భూమి రిసార్టుదేనని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై అదే ఏడాది ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేసినా ఎదురుదెబ్బే తగిలింది. అనంతరం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా 2021లో రిసార్టు యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

అయినప్పటికి అధికారులు పాస్ పుస్తకం ఇవ్వకపోవటంతో రిసా్టు యాజమాన్యం 2022లో హైకోర్టులో ధిక్కరణ కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజాగా ఇరు వర్గాల వాదనల్ని విన్నది. ఈ సందర్భంగా తదుపరి వాయిదాకు కలెక్టర్.. ఆర్డీవో.. తహసీల్దార్ర అంతా పాసుబుక్ తో హాజరుకావాలని ఆదేశించింది. అదేసమయంలో ప్రభుత్వఅధికారుల తీరును తీవ్రంగా తప్పు పడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.