Begin typing your search above and press return to search.

'సుప్రీం' మాటతో తెలంగాణ గవర్నర్ కు తప్పిన ముప్పు

By:  Tupaki Desk   |   21 March 2023 10:06 AM GMT
సుప్రీం మాటతో తెలంగాణ గవర్నర్ కు తప్పిన ముప్పు
X
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి ఎదురయ్యే షాక్ ను త్రుటిలో తప్పించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై. ఈ విషయంలో ఆమె సొలిసిటర్ జనరల్ ఆమెకు అపద్భాందవుడిగా వ్యవహరించారని చెప్పాలి. చేదు అనుభవం త్రుటిలో తప్పిన ఉదంతం తాజాగా సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పై ఫిర్యాదు చేసిన వైనం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళ సై సంతకాలు చేయని విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సంప్రదించటం తెలిసిందే.

దీనికి సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. జస్టిస్ పీఎస్ నరసింహ.. జస్టిస్ జెబీ పార్డవాలాల ధర్మాసనం విచారణను చేపట్టింది. ఈ సందర్భంగా గవర్నర్ కు నోటీసులు ఇవ్వాలన్న వాదనను సీనియర్ న్యాయవాది వాదించారు. అయితే.. గవర్నర్ కు నోటీసులు ఇవ్వబోమని పేర్కొంది. అయితే.. కేంద్రానికి ఇస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ఈ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకోవటంతో విషయం కాస్తంత మెరుగైన పరిస్థితికి చేరుకుంది. గవర్నర్ కు నోటీసులు ఇవ్వటానికి నో చెప్పిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కల్పించుకుంటూ.. కేంద్రానికి ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని కోరారు. తగిన సూచనలు తీసుకొని సమాధానం ఇస్తానని చెప్పాను.

తాను ఇక్కడే ఉన్నాను కాబట్టి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని.. పిటిషన్ కాపీ తనకు అందిస్తే సరిపోతుందన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం నోటీసు జారీ చేయటం లేదని.. ఈ అంశంపై సమాధానం ఇవ్వాలనిమాత్రం పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు నోటీసులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంటూ.. "కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తాం. సాధారణంగా గవర్నర్లకు నోటీసులు జారీ చేయబోం" అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దుష్యంత్ దవే స్పందిస్తూ.. అందుకే తాము గవర్నర్ కు కాకుండా గవర్నర్ కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చామన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ సంతకం చేయకపోవటం వల్ల రాజ్యాంగ ప్రతిష్ఠంభన ఏర్పడిందని.. అందువల్ల రాజ్యాంగంలోని 32వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను వినిపించింది.

మరి.. దీనిపై సొలిసిటర్ జనరల్ వివరాల్ని అడిగి తెలుసుకుంటానంటూ మాట అడ్డు వేయటంతో.. సుప్రీంకోర్టు ఆచితూచి వ్యవహరించటంతో.. గవర్నర్ తమిళ సై కు నోటీసులు జారీ చేసే ఇబ్బందికర పరిస్థితి జస్ట్ మిస్ అయినట్లుగా చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.