Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో వర్కువుట్ కాని 'తెలంగాణ ఫార్ములా'

By:  Tupaki Desk   |   3 May 2023 10:55 AM GMT
మహారాష్ట్రలో వర్కువుట్ కాని తెలంగాణ ఫార్ములా
X
తెలంగాణలో తిరుగులేని రాజకీయ పక్షంగా తమ గురించి తాము చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు మహారాష్ట్ర మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత మహారాష్ట్రలో తమకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేశారు. అందుకే.. మిగిలిన రాష్ట్రాల కంటే కూడా మహారాష్ట్ర మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చాలా వరకు మహారాష్ట్రను అనుకొని ఉండటం.. ఆ రాష్ట్రంలో తెలంగాణ వాసుల బలం కాస్త ఎక్కువగా ఉండటం.. సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్ పథకాల మీద ఆసక్తి వ్యక్తం కావటంతో మహారాష్ట్ర మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే..ఫలితం ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతారు. దీనికి తోడు సంపన్న రాష్ట్రమైన మహారాష్ట్రంలో పాగా వేయగలిగితే.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చన్న ఆలోచన కేసీఆర్ కు ఉంది.

అందుకే.. మొదటగా మహారాష్ట్రలోని భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో భాగంగా ఈ కమిటీ ఉన్న నాందేడ్ జిల్లాలోనే తన తొలి సభను నిర్వహించారు కేసీఆర్. ఈ సభ సందర్భంగా బీఆర్ఎస్ పెట్టిన ఖర్చు.. జనాల తరలింపుతో పాటు మీడియాను మేనేజ్ చేసిన తీరు అక్కడ హాట్ టాపిక్ గా మారాయి. డబ్బుల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిన వైనం అక్కడి రాజకీయ వర్గాల్లో సరికొత్తగా అనిపించింది. దీంతో.. బీఆర్ఎస్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

అంతేకాదు.. తమ పార్టీలో చేరే వారికి భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు వెనుకాడకపోవటం.. హైదరాబాద్ కు వచ్చి పార్టీ కండువా కప్పుకున్న ప్రతివారికి ఏదో ఒక ప్రోత్సహకాన్ని ఇస్తున్న విషయాన్ని గుర్తించిన పలువురునేతలు బీఆర్ఎస్ కండువాను కప్పుకోవటానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. అదే సమయంలో భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బలంగా అనుకున్న కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికల వేళలో ఏదైతే ఫార్ములాను అనుసరించారో.. అదే విధానాన్ని మార్కెట్ కమిటీ ఎన్నికల్లోనూ అమలు చేశారు.

కాకుంటే.. ఫలితం రాకున్నా.. పడిన ఓట్లు మాత్రం బీఆర్ఎస్ గురించి మాట్లాడేలా చేశాయని చెబుతున్నారు. ఓటుకు రూ.10వేలు చొప్పున ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. భోకర్ మార్కెట్ ఎన్నికల్లో తెలంగాణ డబ్బులు మంచినీళ్ల ప్రాయంగా పారాయన్న మాట వినిపిస్తోంది. అయితే.. బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ ను అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా తమలో తాము గెలిచినా ఫర్లేదుకానీ.. బయట నుంచి వచ్చిన బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించకూడదన్న పట్టుదలతో వ్యవహరించినట్లుగా చెబుతున్నారు.

భోకర్ మార్కెట్ కమిటీలోని18 డైరెక్టర్ల పోస్టులు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క డైరెక్టర్ పోస్టు కూడా దక్కకపోవటం తెలిసిందే. మొత్తం 18 డైరెక్టర్ పోస్టుల్లో కాంగ్రెస్ 13.. దాని మిత్రపక్షంగా బరిలోకి దిగిన ఎన్సీపీ రెండు.. బీజేపీ మూడు డైరెక్టర్ పోస్టుల్ని సొంతం చేసుకుంది. ఒక్క డైరెక్టర్ పోస్టును కూడా సొంతం చేసుకోలేక బీఆర్ఎస్ చతికిల పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మొత్తం 3909 ఓట్లు పోల్ అయితే.. బీజేపీకి 2106 ఓట్లు పడ్డాయి. ఉనికి లేని బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో 1153 ఓట్లుపడటం చూస్తే.. దాని ప్రభావం ఎంతన్న విషయం అర్థమవుతుంది. సీట్ల పరంగా ఒక్కటి విజయం సాధించనప్పటికీ.. ఓట్ల పరంగా చూస్తే.. ఇవేమీ తక్కువ ఓట్లు కావంటున్నారు. ఖర్చుచేసిన సొమ్ములకు అంతో ఇంతో ప్రయోజనం కనిపించిందన్న మాట వినిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్.. బీజేపీలు ఒక్కో ఓటుకు గరిష్ఠంగా రూ.5వేలు పంచితే.. బీఆర్ఎస్ మాత్రం ఒక్కో ఓటుకు రూ.10వేలు పంచినట్లుగా స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. మందు.. విందులతో మోత పుట్టించినట్లుగా చెబుతున్నారు. డబ్బుకు డబ్బు పంచుతూ.. పలువురికి ప్రోత్సాహకాల్ని పంచటమే కాదు ఈ ఎన్నికల్లో కేసీఆర్ మరో కీలక ఎత్తుగడను ప్రదర్శించారని చెప్పాలి. గతంలో వివిధ పార్టీల్లో ఎమ్మెల్యే అభ్యర్థలుగా పోటీ చేసి.. రెండు.. మూడో స్థానాల్లో నిలిచిన పలువురు నేతల్ని పార్టీలో చేర్చుకొని గెలుపు కోసం భారీగా ఖర్చు పెడతామన్న హామీని ఇవ్వటంతో పలువురు గులాబీ జెండాను మెడలో వేసుకున్నట్లు చెబుతున్నారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరించేందుకు మార్గంగా ఎంచుకున్న మార్కెట్ కమిటీ ఎన్నికల్లో గులాబీ ప్రభావం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ఫలితాల్లో కనిపించకూడదన్న పట్టును భోకర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ప్రదర్శించినట్లు చెబుతున్నారు. పకడ్భందీగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ ను దెబ్బ తీయాలన్నలక్ష్యంతో ఆయన పలుచోట్ల బలమైన అభ్యర్థులను రంగంలోకి దించినట్లుగా చెబుతున్నారు.

ఈ ఎన్నికల్లో ఒక డైరెక్టర్ పదవికి బీఆర్ఎస్ కీలక నేత నాగనాథ్ పోటీచేశారు. మొత్తంబీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఆయనకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ ఆయన గెలవలేదు. ఈ ఎన్నికల్లో నాగనాథ్ కు 197 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన పాటిల్ సుభాష్ 257 ఓట్లు సాధించి గెలుపొందారు. భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం అస్సలు ఉండేది కాదని.. బీఆర్ఎస్ ఎంట్రీ పుణ్యమా అని.. మొత్తం సీన్ మారిపోవటమే కాదు..భారీగా డబ్బు ఖర్చు పెట్టిన వైనంతో కొత్త కల్చర్ తెరమీదకు వచ్చిందని చెబుతున్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కుట్టుమిషన్ గుర్తుతో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కప్పుసాసర్ గుర్తుతో.. బీజేపీ గొడుగు గుర్తుతో బరిలోకి దిగారు. బీఆర్ఎస్ నోట్ల ఫార్ములా మీద అవగాహన ఉన్న అశోక్ చవాన్ అప్రమత్తంగా ఉండటంతో.. బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించలేదన్న మాట బలంగా వినిపిస్తోంది.