Begin typing your search above and press return to search.

పదేళ్ల ఉత్సవానికి 21 రోజులు పండగ లెక్కేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   14 May 2023 9:00 PM GMT
పదేళ్ల ఉత్సవానికి 21 రోజులు పండగ లెక్కేంది కేసీఆర్?
X
గులాబీ బాస్ కేసీఆర్ తీరు కాస్త భిన్నం. రాజకీయంగా ఏదైనా పెద్ద పరిణామం చోటు చేసుకున్నప్పుడు.. తమకు ఏ మాత్రం సంబంధం లేని విషయంలోనూ ఏదోలా తమ మార్కు కనిపించాలన్న తపన కనిపిస్తుంది. ఉద్యమ కాలం నుంచి కూడా ఈ ధోరణిలో ఆయనలో ఉందని చెప్పాలి. అంతేకాదు..తమ రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినా.. భారీ నిరసన .. ఆందోళన చేపట్టినా.. దానికి కౌంటర్ గా కేసీఆర్ కూడా ఏదో ఒకటి ప్రకటన చేయటం కనిపిస్తుంది. అప్పటివరకు కామ్ గా ఉన్న ఆయన.. ఆ వెంటనే యాక్టివ్ అయిపోతారు. అధికారం చేతిలోకి వచ్చిన నాటి నుంచి ఆయన కొత్త తరహాలో వ్యవహరిస్తున్నారు.

విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యులు ఎవరైనా ఏదైనా ఒక భారీ కార్యక్రమాన్ని చేపడితే.. సరిగ్గా అదే రోజున మీడియాలో తమ పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేయటం కనిపిస్తుంది. అంతేనా.. దినపత్రికలకు అయితే.. ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద జాకెట్ యాడ్ ఇవ్వటం ద్వారా.. ప్రజల అటెన్షన్ తనవైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. తాజాగా కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రెస్ నోట్ ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకోవాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేస్తూ.. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలియజేసేలా ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ రెండు నుంచి 21 రోజుల పాటు ఈ సంబురాలు జరగాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా చెప్పారు. తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటేలా.. ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని స్పష్టం చేయటం గమనార్హం.

సచివాలయంలో మొదటిరోజు ఉత్సవాలు ప్రారంభవుతాయని.. అదే రోజు మంత్రులు వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. 2023 జూన్ 2 నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని.. ఎన్నో పోరాటాలు.. కష్టాల తర్వాత రాష్ట్రం ఏర్పాటైందన్న విషయాన్ని గుర్తు చేశారు.21 రోజుల్లో ఒక రోజును ప్రత్యేకంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవాలని.. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరవీరుల స్తూపాలను పుష్పాలు.. విద్యుత్ దీపాలతో అలంకరించి నివాళులు అర్పించాలన్నారు.

రాష్ట్రాభివృద్ధి గురించి ప్రభుత్వం పడిన కష్టాన్ని, దార్శనికతను, దృక్పథాన్ని, తాత్వికంగా విశ్లేషిస్తూ డాక్యుమెంటును రూపొందించి సినిమాహాళ్లు, టీవీలు తదితర మాధ్యమాలద్వారా ప్రదర్శించాలన్న కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ చరిత్రతెలియజేసేలా డాక్యుమెంటరీ రూపొందించాలని కోరారు. ''ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద తదితర కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను విద్యుత్తు కాంతులతో అలంకరించాలి'' అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదంతా చూసిన తర్వాత అర్థమయ్యేది ఒక్కటే. మరో నాలుగునెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ.. ఈ పేరుతో భావోద్వేగాన్ని రగిల్చాలన్న లక్ష్యం కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. అయినా.. పదేళ్లు గడిచినా.. ఇప్పటికి ఇంటికో ఉద్యోగం రాలేదు. నిరుద్యోగ సమస్య తీరలేదు. రైతుల ఆత్మహత్యలకు చెక్ పడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలెన్నో. ఇన్ని ఉన్నప్పటికీ 21 రోజుల పండుగను నిర్వహించుకోవాలా? అందుకోసం భారీగా నిధులు ఖర్చు పెట్టాలా? అన్నది ప్రశ్న.