Begin typing your search above and press return to search.

సీన్ రివర్సవుతోందా ?

By:  Tupaki Desk   |   11 Jun 2023 1:00 PM GMT
సీన్ రివర్సవుతోందా ?
X
కాలం ఎల్లకాలం ఒకేలాగుండదు. ఒకపుడు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి నేతలు వలసలు వెళ్ళారు. అలాంటిది ఇపుడు అదే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన అధికారపార్టీ ఎంఎల్సీ కూచకుళ్ళ దామోధరరెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కొదుకు రవీందర్ తో కలిసి హస్తంపార్టీ సీనియర్ నేత మల్లు రవితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు.

జూపల్లి కూడా మల్లుతో చాలాసేపు మంతనాలు జరిపారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. తొందరలోనే కేసీయార్ పై అసంతృప్తిగా ఉన్న నేతల్లో కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వినబడతున్నాయి. 20 గానీ లేకపోతే 25వ తేదీన గానీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. పొంగులేటి చేరితే వెంటనే మరికొందరు సీనియర్లు కూడా చేరటానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు కేసీయార్ మీద అసంతృప్తి కారణంగానే చాలామంది కారుపార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అవుతున్నారు. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఘర్ వాపసీ పిలుపు కూడా కొంతవరకు వర్కవుటవుతున్నట్లే అనిపిస్తోంది. కాకపోతే ఇక్కడే మరో అనుమానం కూడా మొదలైంది. బీఆర్ఎస్, బీజేపీ నుండి నేతలు తిరిగొచ్చేస్తే మరి వాళ్ళని ఎలా సర్దుబాటు చేయగలరు ?

ఇతర పార్టీల నుండి వచ్చేవాళ్ళల్లో ఎక్కువమంది టికెట్ల హామీతోనే చేరుతారు. ఇపుడున్న నేతలకే టికెట్లు సర్దుబాటు చేయటం ఎలాగన్న సమస్య వేధిస్తోంది. అలాంటిది ఇతర పార్టీల నుండి వచ్చే నేతలకు టికెట్లే ఇస్తారా ? లేకపోతే ఎంఎల్సీలు, రాజ్యసభ, కార్పొరేషన్ ఛైర్మన్ల పోస్టులు హామీ ఇస్తారా అన్నది తెలీటంలేదు. ఉత్త హామీలతో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేస్తారా అన్న డౌటుకూడా పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.