Begin typing your search above and press return to search.

'అల్లర్లు' ఎందుకు భట్టి? 'షా' లైన్ క్లియర్ గానే ఉందిగా?

By:  Tupaki Desk   |   25 April 2023 9:43 AM GMT
అల్లర్లు ఎందుకు భట్టి? షా లైన్ క్లియర్ గానే ఉందిగా?
X
రాజకీయం మొత్తం ఓటు బ్యాంకు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మిగిలిన రాజకీయ పార్టీల కంటే బాగా అర్థం చేసుకున్న పార్టీగా బీజేపీ నిలుస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయంలో తమ పార్టీ స్టాండ్ ఏమిటి? తమకు ఏం కావాలి? మరేం అక్కర్లేదన్న విషయం పై కమలనాథుల్ని గైడ్ చేసే మోడీషాలకు ఉన్నంత క్లారిటీ దేశంలోని మరే పార్టీకి లేదనే చెప్పాలి. ఈ విషయాన్ని తాజాగా చేవెళ్లలో అమిత్ షా పర్యటన సందర్భంగా మరింత స్పష్టమైందని చెప్పాలి.

ఆదివారం చేవెళ్లలో నిర్వహించిన సభలో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేశారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే నాలుగు శాతం అదనంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని తేల్చేశారు. ఎలాంటి శషబిషలు లేకుండా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ పార్టీకి ఓటు వేసే వారు ఎవరు? వారి ప్రయోజనాలు ఏమిటి? ఏం చెబితే.. తమ ఓటు బ్యాంకు మరింత బలపడుతుందన్న విషయంలో మోడీషాలకు ఉన్నంత క్లారిటీ మరెవరికీ లేదనే చెప్పాలి. ఈ లైన్ కారణంగానే ఇన్ని ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి.

తామేం చేసినా మైనార్టీలు తమకు.. తమ పార్టీకి ఓటు వేసే విషయంలో ముందుకు రారన్న సంగతి మోడీషాలకు బాగానే తెలుసు. ఈ కారణంగానే మిగిలిన పార్టీలు అనుసరించే మార్గంలో కాకుండా.. తమతో కలిసిరాని వారిని వదిలించుకోవటం.. వారిపై గురి పెట్టటం ద్వారా తాము లక్ష్యంగా చేసుకునే వర్గాల్ని మరింత దగ్గర కావటమే తమ ఉద్దేశమన్నట్లుగా వారి తీరు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే మిగిలిన రాజకీయ పార్టీలు.. నేటికి సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే వారంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాటల్నే తీసుకోండి. అమిత్ షా మాటల్ని ఘాటుగా ఖండించిన ఆయన.. అమిత్ షా మాటల కారణంగా అల్లర్లకు ఆజ్యం పోసేలా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా బీజేపీ మరింత బలోపేతం కావటమే కాదు.. కాంగ్రెస్ లోని హిందుత్వ ఓటు బ్యాంకుకు గణనీయంగా దెబ్బ పడే వీలుందన్న మాట వినిపిస్తోంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోంమంత్రి అమిత్ షా ఒక మతానికి వ్యతిరేకంగా చేవెళ్ల సభలో మాట్లాడటందారుణమని వ్యాఖ్యానించారు. అత్యంత వెనుకబడిన ముస్లింలకు కాంగ్రెస్ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిందని.. దానికి బీఆర్ఎస్ 12 శాతానికి పెంచుతానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ మాటల్ని విన్నంతనే.. కాంగ్రెస్.. బీఆర్ఎస్ లు మైనార్టీలకు ఇంత భారీగా రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నారన్న ప్రశ్న ప్రాథమికంగా కలుగుతుంది. మైనార్టీ ఓటు బ్యాంకును తమ వైపునకు లాగుకునేందుకు వీలుగా వారి ప్రకటనలు ఉన్నాయని చెప్పాలి. మైనార్టీలకు అదనంగా కల్పించాలన్న రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా చెప్పినంతనే అల్లర్లు అయితే.

రిజర్వేషన్ల ప్రకటన చేసిన దానికి నష్టపోయే వారు కూడా అల్లర్లు చేస్తారుగా? అన్నది ప్రశ్నగా మారుతుంది. ఇలాంటి చర్చ ఎక్కువైన కొద్దీ.. బీజేపీకి లాభం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే.. అల్లర్లు లాంటి పెద్ద మాటల్ని మాట్లాడటం ద్వారా రాజకీయ ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువన్నది గుర్తిస్తే మంచిదంటున్నారు. మరి.. భట్టికి ఈ విషయాలు అర్థమవుతాయంటారా?