Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   27 Feb 2021 5:21 AM GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
X
దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఎదురుదెబ్బలతో కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని పట్టుదలగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ముందడుగు వేసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

గత సంవత్సరం దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం.. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించినట్లుగా ఫలితాలు రాకపోవడంతో టీఆర్ఎస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఆచితూచి అడుగులు వేస్తోంది.

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తుండడం.. మరోవైపు ఇతర విపక్షాలు, ఇండిపెండెంట్లు సైతం రంగంలో ఉండడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

సీఎం కేసీఆర్ శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించినట్టు తెలిసింది.

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డికి హరీష్ రావు, హైదరాబాద్ కు గంగుల కమలాకర్, మహబూబ్ నగర్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం.

ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఈ ఎన్నికల్లో నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి పనిచేయాలని.. లేకపోతే ఊరుకునేది లేదని కేసీఆర్ మంత్రులకు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం.