Begin typing your search above and press return to search.

ఎక్కడ తగ్గాలో కేసీఆర్ కు మాత్రమే తెలుసట

By:  Tupaki Desk   |   22 Jun 2023 7:12 PM GMT
ఎక్కడ తగ్గాలో కేసీఆర్ కు మాత్రమే తెలుసట
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు చేతి లో అధికారం ఉన్న వేళ.. ఆత్మవిశ్వాసం అంతకంతకూ ఎక్కువ అవుతుంది. ప్రజల్లో నూ ప్రభుత్వం మీద మొహమెత్తేలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. తనను అర్థం చేసుకునే విషయంలో తెలంగాణ ప్రజల కు ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపించే ఆయన తీరు అర్థంకానిదిగా కనిపిస్తుందని చెప్పాలి.

అధికారం చేతి లోకి వచ్చేసినంతనే కంటికి కనిపించకుండా కొందరిని మాత్రమే కలుస్తూ.. మిగిలినవారికి అందుబాటు లోకి రాకుండా ఉండటంతో కేసీఆర్ మరో లెవల్ అని చెప్పాలి. గడిచిన కొద్ది కాలంగా చూస్తే.. ఆయన లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏళ్లకు ఏళ్లతరబడి పెండింగ్ లో ఉన్న వాటిని పరుగులు తీయించటం.. వరుస పెట్టి పర్యటనలు చేస్తూ.. ఓపెనింగుల్లో పాల్గొంటూ.. ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తున్నారో కదా? అన్న భావన ఎన్నికల వేళలో కల్పించే కనికట్టు కేసీఆర్ కు సాధ్యమనే చెప్పాలి.

అంతే కాదు.. తనకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళలో.. ఎలాంటి వారితోనైనా రాజీ చేసుకునే ధోరణి ఆయన లో కనిపిస్తుంది. అప్పటివరకు కత్తి దూసి.. యుద్ధానికి సై అంటే సై అన్నట్లుగా ఉండే ఆయన. అంత లోనే కత్తిని వెనక్కి తీసేసుకొని కామ్ గా ఉండటం లోనూ ఆయన విలక్షణతను ప్రదర్శిస్తారు. ప్రత్యర్థిని ఎప్పటికప్పుడు మార్చేస్తూ.. మార్చిన సంగతి ని ప్రజలు పట్టించుకోకుండా చేయటం లోనూ కేసీఆర్ టాలెంట్ వేరే లెవల్ గా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తాయి.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రాణాల్ని పణంగా పెట్టేసిన శ్రీకాంతా చారి ఆత్మబలిదానం తెలంగాణ సెంటిమెంట్ ను ఎంతలా రగిలించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటి శ్రీకాంతాచారి కుటుంబానికి గడిచిన తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించదు. మరి.. ఉన్నట్లుండి దివంగత శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను హటాత్తుగా ఎమ్మెల్సీగా చేసేందుకు యుద్దప్రాతిపదికన నిర్ణయం తీసుకోవటానికి కారణం.. రానున్న ఎన్నికలే అన్న విషయంలో మరో మాట కు అవకాశం లేదు.

అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించి.. అభాసుపాలై.. తన ఆవేదన ను వ్యక్తం చేసి శంకరమ్మను పట్టించుకోని కేసీఆర్.. అందుకు భిన్నంగా హటాత్తుగా ఆమెకు ఎమ్మెల్సీ పదవిని డిసైడ్ చేయటమే కాదు.. ఆ ప్రకటన ను అధికారికంగా ప్రకటించకముందే.. గన్ మెన్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని.. అధికారిక ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్న వైనం చూస్తే.. ఎప్పడు ఎంతమేర తగ్గాలన్న విషయం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఇదంతా చూస్తే.. ఎన్నికల కు నాలుగు నెలల ముందు తగ్గితే.. ఐదేళ్లు అధికారం చేతి లో ఉంటుందన్న కేసీఆర్ వ్యూహానికి తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.