Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫైర్.. అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ రాజీనామా?

By:  Tupaki Desk   |   27 March 2018 6:38 AM GMT
కేసీఆర్ ఫైర్.. అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ రాజీనామా?
X
సంచ‌ల‌నం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ దేశాయ్ ప్ర‌కాశ్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్ర‌భుత్వంలో ఎంతో కీల‌క‌మైన ఈ ప‌ద‌వికి ప్ర‌కాశ్ రెడ్డి రాజీనామా చేయ‌టం వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హంతోనే ప్ర‌కాశ్ రెడ్డి రాజీనామా చేశార‌ని చెబుతున్నారు.

ఆ మ‌ధ్య‌న అసెంబ్లీలో కోమ‌టిరెడ్డి హెడ్ సెట్ విస‌ర‌టం.. అది కాస్తా మండ‌లి ఛైర్మ‌న్ స్వామిరెడ్డికి త‌గల‌టం.. ఈ ఉదంతంలో కోమ‌టిరెడ్డితో పాటు సంప‌త్ ల‌పై ఎమ్మెల్యే స‌భ్య‌త్వంపై బ‌హిష్క‌ర‌ణ వేటు వేయ‌టం తెలిసిందే. త‌ర్వాత ఈ వ్య‌వ‌హారం కోర్టుకు చేరుకుంది.

ఈ సంద‌ర్భంగా ఈ కేసు విష‌యంలో ప్ర‌కాశ్ రెడ్డి వాదించిన తీరుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు చెబుతున్నారు. కోమ‌టిరెడ్డి.. సంప‌త్ బ‌హిష్క‌ర‌ణ‌ల‌పై కోర్టులో వాద‌న‌ల సంద‌ర్భంగా ప్ర‌భుత్వం అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ స్థానంలో ఉన్న ప్ర‌కాశ్ రెడ్డి వాదించిన తీరుపై ముఖ్య‌మంత్రి అసంతృప్తిగా ఉన్నార‌ని.. దీని ఫ‌లిత‌మే తాజాగా ఆయ‌న రాజీనామాగా చెబుతున్నారు.

అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ఒరిజిన‌ల్ వీడియో ఫుటేజీల‌ను స‌మ‌ర్పిస్తామ‌ని హైకోర్టుకు ఏజీ హోదాలో ప్ర‌కాశ్ రెడ్డి హామీ ఇవ్వ‌టంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తుంది. కోర్టుకు వీడియో ఫుటేజ్ ఇస్తామ‌ని ఎందుకు చెప్పార‌న్న విష‌యంపై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌టం.. దీనిపై మ‌న‌స్తాపానికి గురైన ప్ర‌కాశ్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండా.. వీడియో ఫుటేజ్ ఇస్తామ‌న్న పెద్ద విష‌యాన్ని కోర్టుకు ఎలా చెబుతార‌న్న ప్ర‌శ్న ముఖ్య‌మంత్రి సంధించిన‌ట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ కేసును ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదించ‌టానికి సుప్రీంకోర్టుకు చెందిన సీనియ‌ర్ న్యాయ‌వాది హ‌రీశ్ సాల్వేను ర‌ప్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇది కూడా ప్ర‌కాశ్ రెడ్డి రాజీనామాకు కార‌ణ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వాస్త‌వానికి కోర్టులో వీడియో పుటేజ్ ఇస్తాన‌న్న మాట చెప్పిన రోజునే.. ఈ విష‌యంపై సీఎం అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని.. ఆ వెంట‌నే రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. స‌న్నిహితుల సూచ‌న వేర‌కుకాస్త ఆగిన ఆయ‌న‌.. చివ‌ర‌కు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌ట‌మే మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హార‌శైలి.. ఆయ‌న అందుబాటులో ఉండే స‌మ‌యం విష‌యంలోనూ ప్రకాష్ రెడ్డికి కొంత అసంతృప్తి ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని తెలుసుకునే విష‌యంలో త‌ను ప్ర‌య‌త్నాలు చేసినా.. స‌రైన స‌మ‌యంలో ముఖ్య‌మంత్రితో స‌హా కీల‌క‌మైన వారు అందుబాటులోకి రార‌న్న మాట ప్ర‌కాశ్ నోట వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. మొత్తంగా.. కోమ‌టిరెడ్డి.. సంప‌త్ ల వేటు వ్య‌వ‌హారం మ‌రో మలుపు తిర‌గ‌టం గ‌మ‌నార్హం.