Begin typing your search above and press return to search.

సిద్ద‌ప్ప‌.. గ‌బ్బ‌ర్‌ సింగ్‌.. తెల‌క‌ప‌ల్లి ర‌వి!

By:  Tupaki Desk   |   15 Nov 2015 9:26 AM GMT
సిద్ద‌ప్ప‌.. గ‌బ్బ‌ర్‌ సింగ్‌.. తెల‌క‌ప‌ల్లి ర‌వి!
X
క‌మ్యూనిస్ట్‌ లు చాలా చిత్ర‌మైన వారు. వారికి న‌చ్చింది త‌ప్పించి.. మిగిలినదంతా ఒట్టి భ్ర‌మ‌గా భావిస్తారు. వారి పాటికి వారు ఉంటే ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కానీ.. క‌మ్యూనిస్ట్ లు అలాంటోళ్లు కాదు. పాత‌త‌రం క‌మ్యూనిస్ట్ ల‌కు ఉన్న పేరు ప్ర‌ఖ్యాతులు.. నీతి నిజాయితీ.. నిబ‌ద్ధ‌త లాంటి వాటి పేరు చెప్పుకొని ద్వంద వైఖ‌రిని అనుస‌రించ‌టం ఒక అల‌వాటుగా మారిపోయింది. ఏపీ మీద విప‌రీత‌మైన అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా మాటలు చెబుతున్న క‌మ్యూనిస్టుల‌కు.. విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీ త‌ర‌ఫున‌.. స‌మైక్య‌నినాదం త‌ర‌పున ఏం చేశారో.. సీమాంధ్రులంద‌రికి తెలిసిందే.

రేష‌న్ కార్డు ఇప్పించ‌టం కోసం చావు దెబ్బ‌లు కొట్టించే క‌మ్యూనిస్టులు.. ఏపీ రెండు ముక్క‌లుగా విడిపోతూ.. విభ‌జ‌న కార‌ణంగా దారుణ‌మైన న‌ష్టాన్ని మూట‌గ‌ట్టుకుంటుంద‌ని తెలిసినా కిమ్మ‌న‌కుండా ఉండ‌టం మేధావులైన క‌మ్యూనిస్ట్‌ ల‌కే చెల్లింది. విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించ‌కున్నా.. ఏపీకి నాటి కేంద్ర స‌ర్కారు ఏం ఇవ్వ‌నుంది? విభ‌జ‌న హేతుబ‌ద్ధంగా జ‌రిగిందా? అన్న కోణంలో ఒక్క‌రంటే ఒక్క‌రూ మాట్లాడింది లేదు. ఎవ‌రికి వారు నోట వెంట మాట రాన‌ట్లు ఉండిపోయారే త‌ప్పించి.. నిజాన్ని చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌లేరు. అలాంటి వారు ఇప్పుడు క‌బుర్లు చెప్ప‌టం విశేషం.

గొప్ప రాజ‌కీయ విశ్లేష‌కుడిగా చెప్పుకునే తెల‌క‌ప‌ల్లి ర‌వి విష‌యానికే వ‌ద్దాం. ఏపీ గురించి.. ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడింది లేదు. విభ‌జ‌న స‌మ‌యంలో ఆయ‌న గొంతెత్త‌లేదు స‌రికాదా.. త‌న చ‌ర్య‌ల ద్వారా కూడా ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడింది లేదు.

అంత‌దాకా ఎందుకు.. జాతీయ‌స్థాయిలో ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి త‌మ నాయ‌కుల చేత మాట్లాడించారా? అంటే అదీ లేదు. రాజ్య‌స‌భ‌లో కానీ.. లోక్ స‌భ‌లో కానీ త‌మ పార్టీ త‌ర‌ఫున ఏపీకి జ‌రిగిన అన్యాయం మీద కేంద్రాన్ని ఎందుకు నిల‌దీయ‌లేదు?

ఏపీకి యూపీఏ స‌ర్కారు ఒక విధంగా దెబ్బ తీస్తే.. మోడీ స‌ర్కారు మ‌రోర‌కంగా న‌ష్టం చేస్తున్నా.. కిమ్మ‌న‌కుండా ఉండిపోయారే త‌ప్పించి మాట్లాడింది లేదు. కానీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద మాత్రం తెల‌క‌ప‌ల్లి ర‌వి విరుచుకుప‌డ్డారు. సినిమాటిక్ గా మాట్లాడుతూ.. త‌న మీద దృష్టి ప‌డేలా చేశారు.

ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో భేటీ అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాజ‌ధాని రైతులు మొద‌లు.. విశాఖ‌లోని బాక్సైట్ తవ్వ‌కాల అనుమ‌తి గురించి హెచ్చ‌రించి.. అన్నీ రాజ‌కీయ ప‌క్షాల అభిప్రాయాన్ని తీసుకున్న త‌ర్వాతే అడుగు ముందుకు వేయాల‌ని కోర‌టం తెలిసిందే. ఇంత‌కాలం గిరిజ‌నుల త‌ర‌ఫున తాము మాత్ర‌మే పోరాడ‌తామ‌న్న పేరున్న క‌మ్యూనిస్ట్ ల బ్రాండ్ ఇమేజ్ ఎక్క‌డ దెబ్బ తింటుంద‌ని భ‌యం క‌లిగిందో ఏమో కానీ.. తాజాగా ప‌వ‌న్ పై మండిప‌డ్డారు. చూడ‌ప్ప సిద్ధ‌ప్పా.. రాజ‌కీయాల్లో ఉండే ఉండాల‌ని.. లేక‌పోతే సినిమాలు చేసుకోవాలన్న వ్యాఖ్య‌తో పాటు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌లా బ‌య‌లుదేరి సిద్ద‌ప్ప‌లా వెన‌క్కి వ‌స్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఎవ‌రి త‌ర‌పున ప్ర‌శ్నిస్తున్నాడో అర్థం కాకుండా ఉందంటూ వ్యాఖ్యానించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ చంద్ర‌బాబుకు గెస్ట్ గా ఉండ‌కూడ‌ద‌ని.. గెస్ట్ ఆర్టిస్ట్ లా అప్పుడ‌ప్పుడు క‌నిపించి ఏవో డైలాగులు చెబితే ఏం లాభ‌వ‌మ‌ని.. ప్ర‌జ‌ల్ని త‌న చ‌ర్య‌ల ద్వారా త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ మాట్లాడిన మాటల్లో ఏదీ కూడా ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించింది లేదు. నిజానికి తాను అది చేస్తాను.. ఇది చేస్తాను చెప్పింది లేదు.

అంత‌దాకా ఎందుకు.. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా అంటే.. త‌న‌ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని.. కాస్త స‌మ‌యం అవ‌స‌ర‌మ‌ని చెప్పేశాడు. అయినా.. పూర్తి కాలం రాజ‌కీయాల్లో ఉండి.. జాతీయ పార్టీగా పేరు ప్ర‌ఖ్యాతులున్న క‌మ్యూనిస్టులే.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీ త‌ర‌ఫున ఏమీ మాట్లాడ‌కుండా అన్ని మూసుకున్న వారు.. ప‌వ‌న్ ను ఇప్పుడు ఎలా ప్ర‌శ్నిస్తారు? సీపీఎం పార్టీ వ్య‌వ‌హార‌మైతే మ‌రీ దారుణం. స‌మైక్యానికి తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెబుతూనే ఒక్క‌టంటే ఒక్క నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌ని వ‌ర్గాన్నికి సానుభూతిప‌రులైన తెల‌క‌ప‌ల్లి ర‌వి లాంటి వాళ్లు ప‌వ‌న్ ను విమ‌ర్శించ‌టం ఏమిటో..? అయినా.. సంప్ర‌దాయ క‌మ్యూనిస్టుల‌కు భిన్నంగా సినిమా డైలాగులు చెప్పుడేంది కామ్రేడ్ తెల‌క‌ప‌ల్లి ర‌వి..?