Begin typing your search above and press return to search.

రూల్ 71... టీడీపీకి బ్రహ్మాస్త్రంగా మారిందా?

By:  Tupaki Desk   |   21 Jan 2020 4:25 PM GMT
రూల్ 71... టీడీపీకి బ్రహ్మాస్త్రంగా మారిందా?
X
నిజమే... శాసన మండలిలోని రూల్ 71తో విపక్ష టీడీపీ... అధికార వైసీపీ స్పీడుకు బ్రేకులేసిందనే చెప్పాలి. అధికార వికేంద్రీకరణ పేరిట ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి.. అసెంబ్లీలో మూడు రాజధానులకు ఆమోదం దక్కేలా చేశారు. అయితే శాసన మండలిలో మెజారిటీ కలిగిన విపక్షం టీడీపీ... తాను ఏర్పాటు చేసిన రాజధాని అమరావతిని కేవలం లెజిస్లేటివ్ కేపిటల్ కు మాత్రమే పరిమితం చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అయితే టీడీపీ వ్యతిరేకించినప్పటికీ... అసెంబ్లీలో ఆ బిల్లుకు ఆమోదం లబించింది. ఇక్కడే కాస్తంత వివేకంతో ఆలోచించిన టీడీపీ రూల్ 71ను బయటకు తీసింది. అంతేకాకుండా ఆర్థిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి నేతృత్వంలోని టీడీపీ శిబిరం రూల్ 71ను బ్రహ్మాస్త్రంగానే మలచుకుంది.

ఫలితంగా అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఆమోద ముద్ర వేయించుకున్న వికేంద్రీకరణ బిల్లు మండలిలొో మాత్రం నిలిచిపోయింది. అసెంబ్లీలో తన వాదనలకు విరుద్ధంగా అమరావతిని కేవలం లెజిస్లేటివ్ కేపిటల్ కు మాత్రమే పరిమితం చేస్తూ జగన్ సర్కారు వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపితే... దానిని ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసునంటూ ముందుకు సాగిన టీడీపీ... మండలిలో తనకున్న మెజారిటీతో రూల్ 71ను ప్రస్తావించి తాను అనుకున్నట్లుగానే వికేంద్రీకరణ బిల్లును విజయవంతంగా అడ్డుకుందని చెప్పాలి. మొత్తంగా రూల్ 71తో సీఎం జగన్ స్పీడుకు టీడీపీ బ్రేకులేసిందన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.

అయినా ఈ రూల్ 71 అంటే ఏమిటన్న విషయానికి వస్తే... ప్రభుత్వం తీసుకున్న ఏదేనీ విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే, లేదంటే పున:పరిశీలించాలని చెప్పే హక్కును రూల్ 71 ద్వారా శాసనమండలికి దక్కుతుందన్న మాట. దిగువ సభ తీసుకునే తప్పుడు నిర్ణయాలను అడ్డుకునేందుకే మండలికి ఈ హక్కును కల్పించారన్న మాట. ఈ రూల్ ను మండలిలోని ఏ పార్టీ సభ్యులైనా ప్రతిపాదించవచ్చు. ప్రస్తుతం 58 మంది సభ్ములున్న శాసనమండిలో ఓ 20 మంది మద్దతుతో ఈ రూల్ ద్వారా ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు వేయొచ్చట. ప్రస్తుతం మండలిలో టీడీపీకి 26 మంది సభ్యుల బలమున్న నేపథ్యంలో ఇతర పార్టీల సభ్యుల మద్దతు అవసరం లేకుండానే ఆ పార్టీ రూల్ 71ను అస్త్రంగా మలచుకుంది. అయితే ఈ రూల్ కింద నోటీసు ఎప్పుడు ఇవ్వాలనే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.