Begin typing your search above and press return to search.

ఎంపీ అవినాష్‌ కు సుప్రీం కోర్టు నోటీసులు.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   19 Jun 2023 2:07 PM GMT
ఎంపీ అవినాష్‌ కు సుప్రీం కోర్టు నోటీసులు.. రీజ‌నేంటి?
X
వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న, మాజీమంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు కు సంబంధిం చి తీవ్రస్థాయి లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. "మీకు మంజూరు చేసిన ముంద‌స్తు బెయిల్‌ ను ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దో చెప్పాలి" అని తాజాగా మంజూరు చేసిన నోటీసుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది.

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు లో తొలుత సాక్షిగా న‌మోదైన ఎంపీ అవినాష్ పేరు ను అనేక విచార‌ణల త‌ర్వాత సీబీఐ అధికారులు.. నిందితుడిగా చేర్చారు. ఈ క్ర‌మం లోనే ఎప్పుడైనా తాము అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని గ‌తం లోనే ఈ కేసుల‌ ను విచారిస్తున్న తెలంగాణ హైకోర్టుకు సీబీఐ అధికారులు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో తాను ప్ర‌జాప్ర‌తినిధిన‌ని, ఈ కేసు లో త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా సంబంధం లేద‌ని.. ఇది కుటుంబ వివాదాల నేప‌థ్యంలో జ‌రిగిన హ‌త్య‌గా ఎంపీ అవినాష్ పేర్కొన్నారు.

ఇదేస‌మ‌యంలో తన తండ్రి జైల్లో ఉన్నార‌ని, త‌న త‌ల్లి అనారోగ్యంతో ఉంద‌ని పేర్కొంటూ.. ఆయ‌న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీని పై అనేక విచార‌ణ‌ల త‌ర్వాత‌.. కోర్టు ఎట్ట‌కేల‌ కు ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ప్ర‌తి శ‌నివారం సీబీఐ విచార‌ణ‌ కు హాజ‌రు కావాల‌ని కూడా ఆదేశించింది. ఇక‌, దేశం విడిచి వెళ్ల‌రాద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. పాస్ పోర్టు ఉంటే.. దానిని అధికారుల‌ కు అప్ప‌గించాల‌ని సూచించింది.

ఇదిలావుంటే.. అవినాష్‌ కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డం పై వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత‌.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసులో క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ ఆ ఇంటి నుంచి జ‌రిగాయ‌ని.. ఎంపీకి ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డం స‌మంజ‌సం కాద‌ని.. తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో ఆమె సుప్రీంకోర్టు కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో హత్య కేసు లో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

మే 31న తెలంగాణ హైకోర్టు ఆయన కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది.