Begin typing your search above and press return to search.

ఆ ఓటింగ్ పై కేంద్రం - ఈసీలకు సుప్రీంకోర్టు నోటీసులు!

By:  Tupaki Desk   |   19 Feb 2021 5:30 AM GMT
ఆ ఓటింగ్ పై కేంద్రం - ఈసీలకు సుప్రీంకోర్టు నోటీసులు!
X
ఏ దేశంలో అయినా ఓటింగ్ అనేది సాధారణం. అయితే, పోలింగ్ సమయంలో ఎక్కడ ఉన్నా కూడా తమ ఓటు నమోదు అయిన నియోజకవర్గానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ , సరైన సమయానికి రాలేక చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. పోలింగ్ సమయానికి నియోజకవర్గం వెలుపల ఉండే వ్యక్తులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. తమ నియోజకవర్గాలకు దూరంగా ఉన్న వ్యక్తులు వర్చువల్ విధానంలో ఓటు వేయడంపై అభిప్రాయాలు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

కేరళకు చెందిన కె.సత్యన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈమేరకు స్పష్టం చేసింది. ఆధునిక, సాంకేతిక యుగంలో అందరూ ఓటు హక్కు ఉపయోగించుకునేలా చూడాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఈ-ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎక్కడ్నించైనా తమ ఓటు వేసేలా వర్చువల్ విధానంతో కూడిన సదుపాయం కల్పించాలని, ఆ మేరకు తమ నియోజకవర్గాలకు వెలుపల ఉండే వలసజీవులు, ఎన్నారైలు, ఉద్యోగులు, విద్యార్థులకు ఓటీపీ ఆధారిత ఓటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఉద్దేశాన్ని మరింత విస్తృతం చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాదనలు జరిగే సమయంలో ఆయన స్పందిస్తూ.... "ఇదేం పిటిషన్? మీరు ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాల్లో కూర్చుని ఇక్కడ జరిగే ఎన్నికల్లో ఓటేస్తారా? మీ నియోజకవర్గానికి వెళ్లాలన్న బాధ్యతలేని మీకు న్యాయవ్యవస్థ ఎందుకు సాయం చేయాలి?" అని ప్రశ్నించారు. అంతేకాదు, ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడానికి తమకు పరిమితులు ఉన్నాయని సీజేఐ ఎస్ ఏ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియమ్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. అందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది కాళీశ్వరమ్ రాజ్ స్పందిస్తూ... వ్యక్తులను వారి ఉద్యోగం, ఉపాధే ప్రధానమా? లేక, ఓటు హక్కు వినియోగించుకోవడమే ప్రధానమా? అనే అంశాల మధ్య ఒత్తిడికి గురిచేయలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని ఉదాహరించారు. ఉపాధి కోసం లక్షలాది మంది విదేశాలకు వెళుతున్నారని, వారికి ఓటు హక్కు నిరాకరించడం అన్యాయం అని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఇప్పటికే ఉందని, దాన్ని విస్తృతం చేయాల్సిందిగా తాము కోరుతున్నామని తెలిపారు.