Begin typing your search above and press return to search.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   5 Jan 2021 6:49 AM GMT
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
X
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డిడిఎ చట్టం కింద కేంద్ర అధికారాలు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతుల సిఫార్సులు చెల్లుబాటు అవుతాయని మరియు సరైనవని వాటిని మేము సమర్థిస్తామని , నిర్మాణ పనులు ప్రారంభించడానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి అవసరమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కమిటీ నుంచి అనుమతి పొందాలని కేంద్రాన్ని ఆదేశించింది.

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేటు వరకు 3 కిలోమీటర్ల దూరం వరకు, పచ్చదనానికి విఘాతం కలుగకుండా అభివృధ్ది చేయాలన్నది తమ ఆలోచన అని ప్రభుత్వం పేర్కొంది. రాజపధ్ మార్గంకు ఇరువైపులా ఉన్న శాస్త్రి భవన్, కృషి భవన్, రైలు భవన్, ఉద్యోగ భవన్, నిర్మాణ భవన్, వాయుసేన భవన్ లను పడగొట్టి, సర్వహంగులతో ఒక్కొక్కటి 8 అంతస్తులుండే 10 నూతన భవనాలను నిర్మించేందుకు రూపకల్పన చేశారు.

ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులను సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త పార్లమెంట్, ప్రభుత్వ భవనాల ఆధునికీకరణకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు కేంద్రం రూపకల్పన చేసింది. కొత్త భవనంలో 900 నుంచి 1,200 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా త్రిభూజాకారంలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. గత డిసెంబర్‌ 10న పీఎం మోదీ కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.971 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కేంద్రం చేపడుతోంది. దాదాపు వంద సంవత్సరాల కిందట నిర్మించిన భవనం భవిష్యత్‌ అవసరాలకు సరిపోదని, అగ్ని ప్రమాదాలతో పాటు అనేక భద్రతా పరమైన సమస్యలున్నాయని, ఈ మేరకు నూతన భవనం అవసరమని కేంద్రం పేర్కొంది. ప్రాజెక్టు భూ వినియోగంలో చట్ట విరుద్ధమైన మార్పులు, వారసత్వ సంపద పరిరక్షణ నియమాల ఉల్లంఘన, డిజైన్, పర్యావరణ అనుమతులు తదితర అంశాలను లేవనెత్తుతూ సుప్రీం కోర్టులో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్ 10న ప్రాజెక్టు శంకుస్థాపనకు అనుమతినిచ్చిన సుప్రీం కోర్టు.. నిర్మాణాలకు మాత్రం బ్రేక్ వేసింది. తుది తీర్పు వచ్చేంతవరకూ ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు, భవనాల కూల్చివేత, చెట్ల నరికివేత చేపట్టొద్దని ఆదేశించింది. అయితే , తాజాగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.