Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి సుప్రింకోర్టు సర్టిఫికేట్

By:  Tupaki Desk   |   19 Dec 2020 5:10 AM GMT
ఏపీ ప్రభుత్వానికి సుప్రింకోర్టు సర్టిఫికేట్
X
రాష్ట్రంలో రాజ్యాంగం విచ్ఛిత్తి జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. రాజ్యాంగ విచ్ఛిత్తిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దానిపై ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసింది. కేసు పూర్వపరాలను విచారించిన సుప్రింకోర్టు హైకోర్టు వ్యాఖ్యలపై స్టే విధించారు. అంటే రాజ్యాంగ విచ్ఛిత్తిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సరికాదని సుప్రింకోర్టు తేల్చేసింది.

హైకోర్టు వ్యాఖ్యలపై స్టే ఇవ్వటమే కాదు అసలు రాజ్యాంగవిచ్ఛిత్తి జరిగిందనేంత స్ధాయి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం జడ్జీకి ఏమొచ్చిందో అర్ధం కావటం లేదని విస్మయం వ్యక్తం చేసింది. రాజ్యాంగ విచ్చిత్తి జరిగిందని జడ్జీ అభిప్రాయపడేంతగా పరిస్ధితులేమీ దిగజారలేదని స్పష్టంగా చెప్పేసింది. నిజానికి అటువంటి వ్యాఖ్యలు చేసిన జడ్జీనే సుప్రింకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగవిచ్చిత్తి జరిగిందనేంత తీవ్ర వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని హితవుచెప్పింది.

ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో పోలీసుల చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పరస్ పిటీషన్లు, రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తు టీడీపీ మాజీ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగానే హైకోర్టు జడ్జి రాజ్యాంగ విచ్చిత్తిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చివరకు హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను విచారించిన సుప్రింకోర్టు ఏపి ప్రభుత్వాని సానుకూల సర్టిఫికేట్ నే ఇచ్చింది.

రాజ్యాంగవిచ్చిత్తిపై హైకోర్టులో కేసును విచారించిన జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి ఆదేశాలు, విచారణ పట్ల సుప్రింకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాజ్యాంగం సంక్షోభం అనే అంశంపై హైకోర్టు విచారణలో ఉన్న అన్నీ కేసులపైనా స్టే విధిస్తున్నట్లు సుప్రింకోర్టు తేల్చేసింది. హైకోర్టు జడ్జీలు అభిప్రాయపడినట్లు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం కానీ రాజ్యాంగ విచ్చిత్తి కానీ ఏమీ జరగలేదని స్పష్టంగా ప్రకటించింది.