Begin typing your search above and press return to search.

కూల్‌ కబర్‌; 48 గంటలు దాటితే ఎండ మంట పోతుందట

By:  Tupaki Desk   |   24 May 2015 10:32 AM GMT
కూల్‌ కబర్‌; 48 గంటలు దాటితే ఎండ మంట పోతుందట
X
వారం రోజులుగా భానుడి ప్రతాపాన్ని చవిచూస్తూ.. బిక్కచచ్చిపోతున్న తెలుగు ప్రజలకు ఒక చల్లటివార్తను వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. రోజురోజుకీ మండుతున్న ఎండలు.. ఇంకెంత మరో రెండు రోజులు మాత్రమే ఉంటాయని.. ఆ తర్వాత వాతావరణం సాధారణ స్థాయికి చేరుకుంటుందని పేర్కొంటున్నారు.

తీవ్రస్థాయిలో ఉన్న పగటి ఉష్ణోగ్రతల జోరు మరో 48 గంటలు మాత్రమే ఉంటాయంటున్నారు. శనివారం మాదిరే.. ఆదివారం కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల మీదుగా పశ్చిమ.. వాయువ్య దిశల నుంచి వస్తున్న వేడి గాలుల కారణంగానే.. ఈ భారీ ఎండలు.. ఉక్కపోతగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. దీని తీవ్రత మరో రెండు రోజులు ఉంటుందని.. ఆది.. సోమవారాలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సో.. రెండు రోజుల పాటు కనుక ఎండలో తిరగకుండా ప్లాన్‌ చేసుకుంటే.. ఆరోగ్యంతో పాటు.. తర్వాత రోజుల్లో పనులు కూడా చక్కగా చేసుకునే వీలుందన్న మాట.

మరోవైపు.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రెండు తెలుగురాష్ట్రాల్లో 60 మంది మృత్యువాత పడ్డారు. గత కొద్దిరోజుల మాదిరే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలోని అదిలాబాద్‌లో 48 డిగ్రీలు.. నిజామాబాద్‌లో 48 డిగ్రీలు నమోదు కాగా.. ఏపీలోని మచిలీపట్నంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మొత్తంగా చూస్తే.. రెండు తెలుగు ప్రాంతాల్లోని సరాసరి ఎండలు కనీసం మూడు నుంచి.. గరిష్ఠంగా ఏడు డిగ్రీల వరకూ అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వీలైనంతవరకూ నీడలోనే ఉండేలా చూసుకోవాలని ప్రజల్ని అధికారులు హెచ్చరిస్తున్నారు.