Begin typing your search above and press return to search.

జూన్ 3 వీక్ లో మండే ఎండలకు కారణమేంటి? ఇంకెన్ని రోజులిలా?

By:  Tupaki Desk   |   18 Jun 2023 8:00 AM GMT
జూన్ 3 వీక్ లో మండే ఎండలకు కారణమేంటి? ఇంకెన్ని రోజులిలా?
X
మే వచ్చిందంటేనే వణికే పరిస్థితి. జూన్ వచ్చేస్తుందంటే.. అప్పటివరకు కాచిన ఎండలకు కాస్తంత రెస్టు ఇచ్చేసి.. రంగంలోకి వరుణుకు వచ్చే పరిస్థితి. ఈ ఏడాది అందుకు భిన్నంగా జూన్ మూడో వారంలోనూ 'మే'ను తలపించేలా కాస్తున్న ఎండలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణీ కార్తెను తలపించేలా కాస్తున్న ఎండలతో పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. జూన్ మూడో వారంలోనూ ఇవేం ఎండల్రా బాబు అనుకుంటున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఈ ఎండలు ఇంకెన్ని రోజులు? అసలు ఇలా ఎందుకు ఎండలు కాస్తున్నాయి? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రశ్నలకు సమాధానాలకు వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు కాస్తున్న ఎండలు.. వేడి గాలులు మరో రెండు నుంచి నాలుగు రోజులు తప్పవని ఆమె తేల్చారు. జూన్ 21 నాటికి వాతావరణంలో మార్పులు వస్తాయన్న ఆమె.. ప్రస్తుత ఎండ తీవ్రతకు కారణాల్ని వెల్లడించారు. ''ప్రతి ఏడాది రాజస్థాన్ నుంచి వేడిగాలులు బలంగా వీస్తాయి. వీటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయి. ఈసారి ఉత్తర.. పశ్చిమ దిశ నుంచి వేడిగాలులు తెలుగు రాష్ట్రాలవైపు వస్తున్నాయి. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి'' అని చెప్పారు.

ఈ నెల 20 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పిన ఆమె.. రానున్న రెండు.. మూడు రోజుల్లో విజయవాడ.. అమరావతి ప్రాంతాల్లో అయితే 43-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చన్న అంచనాను వినిపించారు. ఉత్తరాదిని ప్రభావితం చేసిన బిపర్ జాయ్ తుపాను ప్రభావం రుతుపవనాల మీద పడినట్లు చెప్పారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లాకు.. సూళ్లూరుపేట మధ్య రుతుపవనాలు కేంద్రీక్రతమైనట్లు చెప్పారు. సాధారణంగా జూన్ 5 నాటికి గుంటూరు.. క్రిష్ణా జిల్లాలను రుతుపవనాలు తాకుతాయని..13 నాటికి ఉత్తరాంధ్రను తాకుతాయని. ఈసారి సైకిల్ గతి తప్పినట్లు చెప్పారు.

ఈసారి రుతుపవనాల ఆలస్యానికి కారణం చెబుతూ.. ''సాధారణంగా నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలో ఏర్పడతాయి. ఈ గాలులు సముద్రంలోనూ.. ఉపరితలంలోనూ బలంగా ఉండాలి. సముద్రానికి 3 మీటర్ల ఎత్తులో ఈ గాలులు ఏర్పడాలి. అలాంటివేళలోనే రుతుపవనాలు వేగంగా ముందుకెళతాయి. ఈ ఏడాది అలా జరగలేదు. గడిచిన 100 ఏళ్లలో అరేబియన్‌ సముద్రంలో ఇంత తీవ్రమైన తుఫాన్‌ రాలేదు'' అని చెప్పారు. దీంతో.. సముద్రానికి 3 మీటర్ల ఎత్తులో ఏర్పడే గాలుల్ని మాయదారి తుపాన్ లాక్కెళ్లిపోయినట్లు చెప్పారు.

ఏపీతో పాటు వేడి గాలుల తీవ్రత తెలంగాణలోనూ ఎక్కువగా ఉండనున్నాయి. ఇదే విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మెరుపులతో కూడి వర్షాలు కురిసే వీలుందని.. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలకు అవకాశం ఉందని చెప్పారు.