Begin typing your search above and press return to search.

తాజా అధ్యయనం: పురుషుల్లో పోలిస్తే మహిళల్లోనే అలాంటిది ఎక్కువట

By:  Tupaki Desk   |   19 Sep 2021 7:37 AM GMT
తాజా అధ్యయనం: పురుషుల్లో పోలిస్తే మహిళల్లోనే అలాంటిది ఎక్కువట
X
పెద్ద ఎత్తున నిర్వహించిన అధ్యయనం ఒకటి ఇప్పటివరకు బయటకు రాని కొత్త విషయాన్ని వెల్లడయ్యేలా చేసింది. దాదాపు నాలుగు లక్షలకు పైనే ప్రజల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ అధ్యయన ఫలితాలు వెల్లడయ్యాయి. మనిషి అన్న తర్వాత ఆడ.. మగ అన్న తేడా లేకుండా ఆందోళన అన్నది అందరిలోనూ ఉంటుంది. అయితే.. ఎవరిలో ఎక్కువ ఉంటుందన్న అంశంపై తాజా అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాంటి సందర్భాల్లో ఆందోళన ఎక్కువగా ఉంటుంది? దానికి కారణం ఏమిటి? మిగిలిన వారితో పోలిస్తే.. ఎవరిలో ఆందోళన స్థాయిలు ఎక్కువగా ఉంటాయి? ఎవరిలో తక్కువగా ఉంటాయన్న విషయంపై స్వీడన్ లోని లండన్ వర్సిటీ ఈ అంశంపై అధ్యయనాన్ని నిర్వహించారు.

ఇందుకోసం నాలుగు లక్షల మంది వ్యక్తుల డేటా ఆధారంగా ఈ రిపోర్టును సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాల్ని గుర్తించారు. ఇటీవల ఈ నివేదికను ఫ్రాంటియర్స్ లో పబ్లిష్ చేశారు. దీని ప్రకారం.. ఆందోళన అందరికి కొన్ని సందర్భాల్లో రావటం మామూలే. కానీ.. కొందరికి ప్రతి విషయంలోనూ మితిమీరిన ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి వారంతా మానసిక వ్యాధిని కలిగి ఉన్నట్లేనని చెప్పక తప్పదు. వైద్య పరిభాషలో దీన్ని యాంగ్జైటీ డిజార్డర్ గా వ్యవహరిస్తారు. అయితే.. ఇతరులతో పోలిస్తే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తుల్లో ఆందోళన సమస్యలు తలెత్తే ముప్పు దాదాపు 60 శాతం మేరకు తగ్గుతుందని ఈ నివేదిక వెల్లడించింది.

అంతేకాదు.. వ్యాయామాలు చేయటం ద్వారా స్త్రీ.. పురుషుల్లో ఆందోళన స్థాయి ఏ తీరులో మారుతుందో గుర్తించారు. సాధారణ మనుషుల్లో అతి ఆందోళన సమస్యలు యుక్త వయసు నుంచే తలెత్తుతాయి. ప్రపంచ వ్యాప్తంగా 10 శాతం మంది ప్రజలు ఆందోళన సమస్యలతో బాధ పడుతుంటారని అంచనా. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా ఆందోళన సమస్యలు కనిపిస్తాయని ఈ నివేదిక తేల్చింది.

అధ్యయనంలో భాగంగా ఎంపిక చేసిన కొందరు స్త్రీ.. పురుషుల్ని స్కీయింగ్ ఆటలో పాల్గొనటం ద్వారా.. వారి ఆందోళన స్థాయిల్ని గుర్తించారు. పురుషుల టీం కఠిన వ్యాయామాలు చేసినా వారిలో ఆందోళన సమస్యలు వచ్చే ముప్పు ఎలాంటి ప్రభావం ఉండదని అధ్యయనంలో తేలింది. అదే సమయంలో తేలిక వ్యాయామాలు చేసే మహిళా టీంతో పోల్చినప్పుడు..కఠిన వ్యాయామాలు చేసే మహిళల్లో ఆందోళన ముప్పు రెట్టింపుగా ఉంటుందని గుర్తించారు. అదే సమయంలో అసలు ఎప్పుడూ వ్యాయామాలు చేయని మహిళలతో పోలిస్తే.. అత్యధిక స్థాయిలో వ్యాయామాలు చేసే మహిళల్లో ఆందోళన సమస్యల ప్రమాదం తక్కువన్న విసయాన్ని గుర్తించారు.

తాజా అధ్యయనం పుణ్యమా అని ఇప్పటివరకు కనిపెట్టలేని పలు అంశాల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు చేసిన పరిశోధనలు అన్ని కూడా మానసిక అనారోగ్యం.. కుంగుబాటు వంటి సమస్యల మీదనే ఫోకస్ చేశాయి కానీ.. ఆందోళన సమస్యలపైన మాత్రం చేయలేదు. కొన్ని అధ్యయనాలు చేసినా.. వాటి శాంపిల్ సైజ్ పరిమితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ.. తాజా అధ్యయనం మాత్రం అందుకు భిన్నమని చెప్పక తప్పదు. ఈ అధ్యయనం పుణ్యమా అని.. స్త్రీ.. పురుషుల్లో ఆందోళన సమస్యల్లో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయన్న విషయాన్ని తేల్చేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని తేల్చారు. రానున్న రోజుల్లో ఈ గుట్టు రట్టు చేసే ప్రయత్నాలు జరగాల్సి ఉంది.