Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏంచెప్పింది

By:  Tupaki Desk   |   17 Aug 2016 6:28 AM GMT
కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏంచెప్పింది
X
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. దసరా నాటికి కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కొత్త జిల్లాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం వరుసగా పలువురితో భేటీ అయింది. ఈ సందర్భంగా వారి దృష్టికి పలు వినతులు వచ్చాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కీలకాంశాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పలు కీలక సిఫార్సుల్ని సిద్ధం చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనల్ చేసినట్లే తెలంగాణలో 14 జిల్లాలు సరిపోతాయని మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. దీంతో.. జిల్లాల సంఖ్య మరిన్ని పెంచాలన్న డిమాండ్ పక్కకు వెళ్లినట్లే. జిల్లాల ఏర్పాటుకు జనాభా ప్రాతిపదికన కాక విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఉప సంఘం సూచించనుంది. ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం చేస్తున్న సూచనలివే..

= కొత్త జిల్లాల సంఖ్య 14 చాలు. జిల్లా సంఖ్యను పెంచితే నియోజవర్గాలు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాల సర్దుబాటు ఇబ్బందికరంగా మారుతుంది.

= కొత్త రెవెన్యూ డివిజన్లు.. మండలాల విభజనలో ఉదారంగా వ్యవహరించాలి. ప్రజల సౌలభ్యం కోసం వీలైనన్ని కొత్తవి ఏర్పాటు చేయాలి.

= కొత్త జిల్లాలకు జనాభానే ప్రాతిపదిక కాకూడదు. ప్రభుత్వ ప్రతిపాదిన జిల్లాల్లో 10 లక్షల కంటే తక్కువ జనాభానే ఉంది. సికింద్రాబాద్ లో 40 లక్షల మేర జనాభా ఉంటుంది.

= విభజన అనంతరం హైదరాబాద్ లో 44 లక్షలు.. వరంగల్ లో 22 లక్షలు.. నల్గొండలో 17 లక్షల మేర జనాభా ఉంటుంది. ఇంతకుమించి కుదించటం సాధ్యం కాదు. జనాభా ఎక్కువైనా దానిని సర్దుబాటు చేసే పరిస్థితి లేనందున విస్తీర్ణాన్ని ప్రాతిపదికగా తీసుకొనే విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. దీంతో.. అనవసరమైన గందరగోళానికి తావు ఉండదు.

= గద్వాల.. జనగామ.. ములుగు ప్రాంతాల నుంచి వస్తున్న వినతుల దృష్ట్యా ప్రభుత్వ ముసాయిదాలలోని జిల్లాల సరిహద్దులు.. జిల్లా కేంద్రాల మార్పులు చేర్పులు చేపట్టాలి.

= చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా హైదరాబాద్ పాత జిల్లాను యథాతథంగా కొనసాగించాలి. కొత్తగా ఏర్పడిన ప్రాంతాలతో సికింద్రాబాద్ జిల్లా ఉండాలి.

= కంటోన్మెంట్ మొత్తాన్నిఒకే జిల్లాలో కొనసాగించాలి. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా పాత జోనల్ విధానం సరికాదు. దాన్ని అనుసరించకూడదు. ఈ అంశాన్ని సమీక్షించాలి.