Begin typing your search above and press return to search.

పశ్చిమ గోదావరిలో వింత జంతువు కలకలం.. ఏకధాటిగా పశువులపై దాడి

By:  Tupaki Desk   |   2 April 2021 9:42 AM GMT
పశ్చిమ గోదావరిలో వింత జంతువు కలకలం.. ఏకధాటిగా పశువులపై దాడి
X
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం కేతవరంలో ఓ వింత జంతువు కలకలం సృష్టిస్తోంది. వారం రోజులుగా పశువులపై ఏకధాటిగా దాడులు చేస్తోంది. దాని దాడుల్లో ఇప్పటికే చాలా పశువులు మృతిచెందగా.. మరికొన్ని గాయపడ్డాయి. గ్రామంలోని ఆవులు, దూడలతో కలిపి 20 పశువులు ఆ వింత జంతువు దాడికి బలయ్యాయి. దాంతో స్థానికులు వణికిపోతున్నారు.

ఆ వింత జంతువు ఆచూకీ తెలుసుకోవడానికి గ్రామస్థులు రాత్రి వేళల్లో కాపలా ఉంటున్నారు. అయినా ఇప్పటికీ గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. ఏకధాటిగా పశువలపై దాడి చేస్తూ కంటికి మీద కునుకు లేకుండా చేస్తోందని వాపోయారు. ఆ జంతువు బీభత్సంతో ఇప్పటికే చాలామంది రైతులకు నష్టం కలిగిందని... పశువులపై అతి దారుణంగా దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులపైనా దాడికి ప్రయత్నిస్తుందేమోనని భయం వ్యక్తం చేశారు.

ఈ వింత జంతువు సంచారంపై ఇప్పటికే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. వారు త్వరగా స్పందించి తమకు ఆ జంతువు దాడుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో అటవీ శాఖ వెంటనే అప్రమత్తమైంది. స్థానికంగా ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఆ జంతువు ఆనవాళ్లు గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే గుర్తిస్తామని అన్నారు.

గతంలో తూర్పు గోదావరి జిల్లాలోనూ ఓ వింత జంతువు ఇదే తరహాలో పశువులపై దాడి చేయడం గమనార్హం. కొన్ని రోజుల తర్వాత దానిని ఓ బావిలో గుర్తించారు. ఇకపోతే ఆ జంతువు అటవీ కుక్క అని అటవీ అధికారులు తేల్చారు. అయితే ఈ జంతువును త్వరగా పట్టుకోవాలని.. తద్వారా తమ పశువులను కాపాడుకోవచ్చని లేదంటే ఉన్న పశువులూ బలవుతాయని స్థానికుల ఆందోళన చెందుతున్నారు.