Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి కాళ్ల‌కు మొక్కుతా.. త‌ప్పేంటి: శ్రీశైలం ఈవో హాట్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   21 Feb 2023 6:00 AM GMT
పెద్దిరెడ్డి కాళ్ల‌కు మొక్కుతా.. త‌ప్పేంటి:  శ్రీశైలం ఈవో హాట్ కామెంట్స్‌
X
అది ప్ర‌పంచ ప్ర‌సిద్ధ శైవ క్షేత్రం. భూమండ‌లానికి నాభిస్థానంగా భావించే శ్రీశైలం. నిత్యం కొన్ని ల‌క్ష‌ల మంది భ‌క్తులు వ‌చ్చి శ్రీశైలం మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నం అయితే.. చాల‌ని పొంగిపోతారు. మ‌రి అలాంటి ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రానికి కార్య‌నిర్వ‌హ‌ణాధికారిగా ఉన్న అధికారి.. ఏం చేయాలి.. కుదిరితే.. భ‌క్తుల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు అందేలా చేయాలి. లేక‌పోతే.. త‌న ప‌నితాను చేసుకునిపోవాలి. కానీ, స‌ద‌రు అధికారి మాత్రం మంత్రిగారి కాళ్లు మొక్కుతాను.. త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌ల శివ‌రాత్రి వేడుక‌ల‌కు వ‌చ్చిన మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి కాళ్లు మొక్కారు. దీనిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో స‌మ‌ర్ధించుకున్నారు. ఆ వైసీపీ, విన‌య విధేయ అధికారే ల‌వ‌న్న‌!!

తాజాగా శ్రీశైలంలో మ‌హాశివ‌రాత్రి బ్రహ్మోత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఇంకాముగియ‌లేదు. కానీ, ఇంత‌లోనే ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. ఆల‌యంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌ను మీడియాకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను నోరు జారేశారు. ``నాకు జగద్గురు పీఠాధిపతి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు ఒకటే. జగద్గురు స్వామి, పెద్దిరెడ్డి ఇద్దరి కాళ్లు మొక్కుతా. ముఖ్యంగా పెద్దిరెడ్డి నాకు దేవుడు. ఆయ‌న కాళ్ల‌కు మొక్కితే త‌ప్పేముంది? అందులో నేర‌మేముంది`` అని మీడియాను ప్ర‌శ్నించారు.

ల‌వ‌న్న సారు.. అక్క‌డితో కూడా ఆగ‌లేదు. ``మంత్రి పెద్దిరెడ్డి, నేను ఒకే ఊరి వాళ్ళము. 76 సార్లు అయ్యప్ప మాల పెద్దరెడ్డి వేశారు. అందరిలోనూ శివుడు ఉన్నాడు. పెద్దిరెడ్డి సార్‌లోనూ ఉన్నాడు. నాలోనూ శివుడు ఉన్నాడు. మంత్రి పెద్దరెడ్డి లో కూడా శివుడు ఉన్నాడు.. అందుకే ఆయన కాళ్లు మొక్కాను. భ‌విష్య‌త్తులోనూ మొక్కుతాను.

నేను గర్భగుడిలో కాళ్లు మొక్క లేదు.. గేట్ దగ్గర మంత్రి కాళ్లు మొక్కాను తప్పేంటి ఏంటి. నాకు పెద్దరెడ్డి శివుడితో సమానం. శివుడికి శివుడు మొక్కడం తప్పు కాదు. మంత్రి పెద్దిరెడ్డి నా గురువు. ఆయ‌న ఆదేశిస్తే.. ఏమైనా చేస్తా`` అని ల‌వ‌న్న సారు సెల‌విచ్చారు. మ‌రి శ్రీశైలం వెళ్లే భ‌క్తులు.. ఇక‌, ఆగిపోయి.. పెద్దిరెడ్డి ఎక్క‌డున్నారో తెలుసుకుని ఆయ‌న కాళ్ల‌కు న‌మ‌స్క‌రిస్తే బెట‌రేమో.. అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.