Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: సిక్కోలు సిగలో పాగా వేసేదెవరో..?

By:  Tupaki Desk   |   28 March 2019 4:32 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: సిక్కోలు సిగలో పాగా వేసేదెవరో..?
X
పార్లమెంట్ నియోజకవర్గం: శ్రీకాకుళం

టీడీపీ: కింజారపు రామ్మోహన్‌ నాయుడు
వైసీపీ: దువ్వాడ శ్రీనివాసరావు

ఉత్తరాంధ్రలో కీలక లోక్‌ సభ నియోజకవర్గం శ్రీకాకుళం. అభివృద్ధికి ఆమడదూరం ఉన్నా రాజకీయ చైతన్యం మాత్రం ఎక్కువే ఇక్కడ. రాంగోపాల్‌ - ఎర్రన్నాయుడు వంటి ఉద్దండులు ప్రాతినిథ్యం వహించిన ఈ జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ - వైసీపీల మధ్యే పోరు రసవత్తరంగా సాగుతోంది.

లోకసభ నియోజకం శ్రీకాకుళం చరిత్ర:

అసెంబ్లీ నియోజకవర్గాలు: శ్రీకాకుళం - ఇచ్చాపురం - టెక్కలి - పలాస - పాతపట్నం - ఆముదాల వలస - నర్సన్నపేట

ఓటర్లు: 14లక్షలు

1952లో నియోజకవర్గం ఏర్పడింది. బోడెపల్లి రాజగోపాల్‌ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఈయన నియోజకవర్గంలో ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ అభ్యర్థులే ఎక్కువగా గెలిచారు. 1996 నుంచి కింజారపు ఎర్రన్నాయుడు టీడీపీ నుంచి నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆయన మరణానంతరం తన కుమారుడు రామ్మోహన్‌ నాయుడు గత ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్‌ లో అడుగుపెట్టారు.

* రామ్మోహన్‌ నాయుడు మళ్లీ గెలిచేనా?

శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వెనుకబడిన ప్రాంతం. దీంతో తండ్రిబాటలోనే రామ్మోహన్‌ నాయుడు సమస్యల పరిష్కారానికి కొంత వరకు కృషి చేశారు. అయితే ఆ ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై లోక్‌ సభలో ప్రస్తావించినప్పటికీ సమస్య పరిష్కారానికి మాత్రం రామ్మోహన్‌ నాయుడు కృషి చేయలేదు. పవన్ కళ్యాణ్ ఈ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ చేయడంతో టీడీపీ వైఫల్యం బయటపడింది. టీడీపీపై వ్యతిరేకతకు కారణమైంది. ప్రభుత్వ ఈ సమస్యపై ప్రత్యేక చొరవ చూపుతుండడంతో ఎంపీకి అనుకూలంగా మారింది.

*అనుకూలతలు:

-ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు
-మౌలిక వసతుల కల్పనలో కృషి
-దత్తత గ్రామాల్లో అభివృద్ధి

* ప్రతికూలతలు

-ఎన్నికల హామీలు పట్టించుకోకపోవడం
-సీసీరోడ్ల వంటి అభివృద్ధి పనులు చేపట్టినా పెద్ద పెద్ద సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి.
-ఆముదాల వలసలో రైలు నిలపడంలో కృషి చేయకపోవడం

*దువ్వాడ శ్రీనివాసరావుకు సెంటిమెంట్ తో చాన్స్ దక్కేనా?

2009 - 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాసరావు మరోసారి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైసీపీ సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు సార్లు ఓడిపోవడం.. ప్రతిపక్ష వైసీపీ గాలి తోడవడంతో ఈయనపై సానుభూతి జిల్లాలో నెలకొంది. అదే గెలుపునకు దోహదం చేస్తోంది. ఏళ్లుగా టీడీపీ ప్రభుత్వం పాలిస్తున్నా అభివృద్ధి చేయడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదని ప్రచారం చేస్తున్నారు.

* అనుకూలతలు:

-నియోజకవర్గంలో పార్టీ బలపడడం
-జగన్‌ పాదయాత్ర కలిసిరావడం

*ప్రతికూలతలు:

-టీడీపీకి కంచుకోట
-కార్యకర్తల్లో సమన్వయ లోపం

*అభివృద్ధే ఎజెండా.. ఎవరైనా గెలవచ్చు..

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన రామ్మోహన్‌ నాయుడు మౌలిక వసతుల కల్పనలో ముందున్నారు. అయితే పార్లమెంట్‌ స్థాయిలో మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. దీనినే ప్రచారం అస్త్రంగా వాడుకుంటున్న దువ్వాడ శ్రీనివాస్‌ ఈసారి ఎలాగైనా వైసీపీ గెలిస్తే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీ కంచుకోటగా ఉన్న శ్రీకాకుళంలో ఆ సెంటిమెంట్ ను తోసిరాజని వైసీపీ బద్దలు కొడుతుందా..? లేదా..? అనేది చూడాలి.