Begin typing your search above and press return to search.

హవాలా రాకెట్లో శ్రీకాకుళం నేతలు?

By:  Tupaki Desk   |   14 May 2017 6:33 AM GMT
హవాలా రాకెట్లో శ్రీకాకుళం నేతలు?
X
వందల కోట్ల హవాలా రాకెట్ సూత్రధారి మహేశ్ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆయన వెనుక కొందరు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హవాలా మార్గంలో డబ్బును మలేసియా, బ్యాంకాక్, సింగపూర్ దేశాలకు మహేష్ తరలించినట్టు తేలడంతో ఉత్తరాంధ్రనుంచి ఆయా దేశాలకు తరచూ రాకపోకలు సాగించిన వారి వివరాలను కూపీ లాగుతున్నారు. గతంలో కొందరు ప్రజా ప్రతినిధులు ఈ దేశాలకు వెళ్లారన్న సమాచారం దొరకడంతో ఆ కోణంలో ఆరా తీస్తున్నారు.

మహేష్‌కు ఒక ఐఎఫ్‌ఎస్ అధికారి, ఆయన బంధువులు సహకరించారని, వారి ద్వారానే శ్రీకాకుళానికి చెందిన ఒక మాజీ మంత్రి తన నల్లడబ్బును తెలుపు చేసుకునేందుకు మహేష్‌ను ఆశ్రయించాడని అంటున్నారు. ఇందులోభాగంగానే వడ్డి మహేష్ నరసన్నపేట ఆంధ్రాబ్యాంకులో ఒక డొల్ల కంపెనీ పేరిట కరెంట్ అకౌంట్ ప్రారంభించినట్టు సమాచారం.

ఆ కంపెనీకి ఆధారంగా మహేష్ తొలుత పద్మప్రియ స్టోన్ క్రషర్ పేరిట శ్రీకాకుళంలో కార్యాలయం ప్రారంభించాడు. రూ. 3 కోట్లు అప్పు కావాలంటూ నరసన్నపేట ఆంధ్రాబ్యాంకులో దరఖాస్తు చేయగా అందుకు ష్యూరిటీగా అవసరమైన ఆస్తులు కావాలంటూ బ్యాంకు అధికారులు కోరారు. ఈ నేపథ్యంలోనే కోటబొమ్మాళి మండలం రాజయ్యపేట పంచాయతీలో 2.34 ఎకరాలు, జిఎన్ పేట పంచాయతీలో 4.5 ఎకరాలు కొనుగోలు చేసిన మహేష్, తర్లిపేట పంచాయతీలో సర్వే నెం. 1బిలో కొండలీజు కోసం మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. రవాణా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియని వ్యక్తులకు, ఎక్కడి నుంచో వచ్చినవారికి అనుమతులు ఇవ్వద్దంటూ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించడంతో పద్మప్రియ క్రషింగ్ క్వారీకి అనుమతి లభించలేదు.

అయితే... మహేశ్ శ్రీకాకుళం కేంద్రంగా ఈ వ్యవహారాలు నడిపించినప్పటికీ ఆయన శ్రీకాకుళం జిల్లావాసి కాదు. ఆయనది పశ్చిమగోదావరి. కానీ... శ్రీకాకుళానికి చెందిన పలువురు నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది.