Begin typing your search above and press return to search.

దేశంలో ప్రైవేటీక‌ర‌ణ మ‌రింత వేగం అమ్మేవి ఏవంటే..?

By:  Tupaki Desk   |   27 March 2021 4:30 PM GMT
దేశంలో ప్రైవేటీక‌ర‌ణ మ‌రింత వేగం అమ్మేవి ఏవంటే..?
X
విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా ఏపీలో ప్ర‌జ‌లు ఆందోళ‌న కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకునేంత వ‌ర‌కూ ఉద్య‌మిస్తామ‌ని అంటున్నారు. కానీ.. మ‌రోవైపు కేంద్రం ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో వాటాల విక్ర‌యానికి ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్న‌ట్టు స‌మాచారం. ఇందుకోసం ప‌క్కా ప్ర‌ణాళిక‌‌ను సిద్ధం చేసిందని తెలుస్తోంది. రాబోయే ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ రంగంలో వాటాల విక్ర‌యం ద్వారా రూ.1.75 ల‌క్ష‌ల కోట్లు సంపాదించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ట‌.

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసేలోగా 1.75 ల‌క్ష‌ల కోట్ల‌ను స‌మీక‌రించాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ట‌. న‌ష్టాల్లో ఉన్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ప్రైవేటీక‌ర‌ణ అమ‌లు చేయ‌డం ద్వారా.. ప్ర‌భుత్వ వాటాల‌ను ప్రైవేటు వ్యాపారుల‌కు అమ్మ‌డం ద్వారా ఈ మొత్తం కూడ‌బెట్ట‌నుందట‌.

ఇందులో మేజ‌ర్ షేర్ బీపీసీఎల్ ప్రైవేటీక‌ర‌ణ ద్వారానే స‌మ‌కూర్చుకోవాల‌ని కేంద్రం చూస్తోంద‌ని సమా‌చారం. ఈ ఒక్క సంస్థ నుంచే దాదాపు రూ.80 వేల కోట్లు వ‌స్తాయ‌ని కేంద్రం అంచ‌నా వేస్తోంద‌ట‌. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ)ని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయ‌డం ద్వారా ల‌క్ష కోట్ల రూపాయ‌లు ఆర్జించాల‌ని చూస్తోంద‌ట‌. ఇప్ప‌టికే ఈ ప‌ని మొద‌లైంద‌ని, ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసేలోపు ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తోంద‌ట కేంద్ర ప్ర‌భుత్వం.