Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం విడుదల..!

By:  Tupaki Desk   |   16 Feb 2023 9:00 PM GMT
ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం విడుదల..!
X
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.. టీడీపీ వ్యవస్థాపకుడు.. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు అరుదైన గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వంద రూపాయల వెండి నాణేలను విడుదల చేసేందుకు ఆర్బీఐ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మరో రెండు నెలల్లో ఈ నాణేలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది.

ఎన్టీఆర్ చిత్రంతో కూడిన నాణెంలో యాభై శాతం వెండి.. నలభై శాతం రాగి.. ఐదు శాతం చొప్పున జింకు.. నికెల్‌ ఉంటాయి. ఇటువంటి నాణేలు గతంలోనూ ఆర్బీఐ విడుదల చేసింది. ప్రముఖ వ్యక్తుల గౌరవార్థం ఆర్బీఐ నాణేలను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో ఎంఎస్‌ సుబ్బలక్ష్మి చిత్రంతో కూడిన నాణేన్ని సైతం ఆర్బీఐ విడుదల చేసింది.

నందమూరి తారక రామారావు బొమ్మతో కూడిన నాణేన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కలిగిన వారు రిజర్వు బ్యాంకు కౌంటర్‌ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4160 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ కాయిన్ తోపాటు ఆయన జీవిత చరిత్రతో కూడిన ముఖ్యాంశాలు నాలుగు పేజీల బుక్ రూపంలో నాణేన్ని కొనుగోలు చేసిన వారికి ఆర్బీఐ అందజేయనుంది.

కాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన కూతురు పురందేశ్వరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు గతంలో కలిశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వంద రూపాయల నాణాన్ని విడుదల చేయాలని కోరింది. ప్రస్తుతం ఆమె బీజేపీలోనే ఉండటంతో ఆమె కోరికకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి ఆమె ప్రతిపాదనకు సానుకూల స్పందన వచ్చింది. దీంతో ఎన్టీఆర్ బొమ్మతో కూడిన కాయిన్ ఏర్పాట్లకు ఆర్బీఐ ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్ర బుక్‌లెట్‌ రూపకల్పన కోసం ఆర్‌బీఐ అధికారులు పురందేశ్వరిని కలిసి వివరాలు సేకరించారు. తన తండ్రి ఆశీర్వాదంతోనే బుక్‌లెట్‌ రూపకల్పన సాధ్యమైందని.. ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని పురందేశ్వరి తెలిపారు.

చిత్రసీమకు.. రాజకీయాల్లో ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్ ను కేంద్రం గుర్తించి అరుదైన పురస్కారం అందించడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేలా కృషి చేశారు. ఇప్పుడు బీజేపీలో ఉండి ఆయన శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ బొమ్మతో కూడిన నాణేన్ని విడుదలయ్యేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.