Begin typing your search above and press return to search.

తొలి లేఖలోని 9 అంశాలేంటి? మలి లేఖలో మిగిలింది ఇవే!

By:  Tupaki Desk   |   13 Feb 2022 9:35 AM GMT
తొలి లేఖలోని 9 అంశాలేంటి? మలి లేఖలో మిగిలింది ఇవే!
X
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మోడీ సర్కారు తాజాగా వ్యవహరించిన తీరు కొత్త సందేహాలకు తావిచ్చింది. ఏపీకి హోదా విషయంలో మోడీ సర్కారు మాటేమిటి? అన్న విషయంపై స్పష్టత ఉన్నప్పటికి అనూహ్యంగా నిన్నటి సబ్ కమిటీ అంశాల్లోకి ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగటంతో పాటు.. మోడీ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించటానికి సిద్ధమైందా? అన్న సందేహం వ్యక్తమైంది.

అదే సమయంలో.. సబ్ కమిటీలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారన్న సమాచారం బయటకు వచ్చినంతనే.. ఏపీ అధికారపక్ష నేతలు క్షణం ఆలస్యం చేయకుండా.. దాని క్రెడిట్ అంతా సీఎం జగన్ దేనంటూ పోటాపోటీ ప్రకటనలు ఇచ్చేయటం చూస్తే.. ఔరా అనుకోకుండా ఉండలేం.

ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ కమిట్ మెంట్ ఏ పాటిది? గడిచిన మూడేళ్ల వ్యవధిలో ఆయన ఎంతమేర ప్రయత్నించారు? కేంద్రంతో ఈ విషయాన్ని ఏ స్థాయిలో చర్చించారన్నది తెలియంది కాదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేవారు.

ఈ కమిటీలో ఏపీ నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ఎస్ రావత్.. తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సభ్యులు. సబ్ కమిటీ తొలిసారి ఈ నెల 17న (గురువారం) ఉదయం 11 గంటలకువీడియో కాన్ఫరెన్సు ద్వారా తొలిసారి సమావేశం కానుంది.

నెలకు ఒకసారి చొప్పున సమావేశమయ్యే ఈ సబ్ కమిటీ కేవలం ఆర్థిక పరమైన వివాదాలకు మాత్రమే పరిమితమై పని చేయనుంది. ఈ లేఖలోని అంశాలు శనివారం ఉదయం బయటకువచ్చాయి. తొలుత తొమ్మిది అంశాలు ఉండటం.. అందులో ప్రత్యేక హోదా అంశాన్ని పేర్కొనటంతో హడావుడి మొదలైంది. ప్రత్యేక హోదా క్రెడిట్ మొత్తం సీఎం జగన్ ఖాతాలో వేయటానికి వైసీపీ బ్యాచ్ పడిన ఆరాటం అంతా ఇంతా కాదు.

ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అయితే ఒక అడుగు ముందుకేసి జగన్ ను ఆకాశానికి ఎత్తేసి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు. మీడియాలో పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారమో.. లేదంటే కేంద్రం అనుకున్న దానికి భిన్నమైన అంశాలు ఎజెండాలో చేరాయన్న విషయం అర్థమైన వెంటనే.. తెర వెనుక కదలికలు వేగంగా సాగి.. సాయంత్రానికి పొద్దున ఉన్న తొమ్మిది అంశాలు కాస్తా ఐదుకు తగ్గిపోయాయి.

ఉదయం నుంచి హడావుడి నెలకొన్న ప్రత్యేక హోదా మిస్ అయ్యింది.

శనివారం ఉదయం బయటకు వచ్చిన తొలి లేఖలో పేర్కొన్న 9 అంశాలు ఏవంటే..
1. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక కార్పొరేషన్‌ విభజన
2. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్తు సంస్థల సర్దుబాటు
3. పన్నుల అంశాల్లో లోపాలు తొలగింపు
4. నగదు.. బ్యాంకు డిపాజిట్ల విభజన
5. ఏపీఎస్సీఎస్సీఎల్.. టీఎస్సీఎస్సీఎస్సీ ఎల్ క్యాష్ క్రెడిట్
6. రెవెన్యూ లోటు
7. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్‌
8. ప్రత్యేక హోదా
9. పన్ను రాయితీలు
శనివారం సాయంత్రం విడుదలైన మలి లేఖలోని అంశాలు
1. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికకార్పొరేషన్‌ విభజన
2. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్తు సంస్థల సర్దుబాటు
3. పన్నుల సంబంధిత అంశాల్లో లోపాల తొలగింపు
4. నగదు బ్యాలెన్సు, బ్యాంకు డిపాజిట్ల విభజన
5. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌, తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌ క్యాష్‌ క్రెడిట్‌