Begin typing your search above and press return to search.

సీఎం జగన్ - విజయసాయిరెడ్డికి ఈడీ షాక్

By:  Tupaki Desk   |   9 Jan 2021 7:15 AM GMT
సీఎం జగన్ - విజయసాయిరెడ్డికి ఈడీ షాక్
X
ఏపీ సీఎం జగన్ కు షాక్ తగిలింది. సీఎం జగన్ తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. హెటేరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రైడెంట్ శరత్ చంద్ర, అరబింద్ ఎండీ నిత్యానందరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యలకు కూడా సమన్లు వచ్చాయి. హెటేరో , అరబిందో ఫార్మాకు కూడా భూముల కేటాయింపు కేసులో సమన్లు ఇచ్చారు. ఈ కేసు ఇటీవలే నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది.

ఈ సమన్లపై జగన్ తరఫు న్యాయవాదులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. 11వ తేదీన వైఎస్ జగన్ కోర్టుకు హాజరవుతారా? లేక ఆయన తరఫును న్యాయవాదులు ఏదైనా మినహాయింపు కోరతారా? అనేది తేలాల్సి ఉంది.

జగన్‌ ఆస్తుల కేసులపై సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. సీబీఐ కోర్టులో ఆరు ఛార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఒక ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే.. నాంపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉన్న చార్జిషీట్‌ను కూడా స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్‌లో కోరింది.

సీబీఐ కోర్టు ఫార్మా కంపెనీలకు సంబంధించి కొత్త నెంబర్ వేసి నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. మరోవైపు 11న నెల్లూరు జిల్లాలో అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు ఈడీ కోర్టుకు రావాలని సమన్లు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఫార్మా కంపెనీలకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి నాంపల్లి ఎంఎస్‌జే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై జగన్ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు చార్జిషీటు దాఖలు చేసేలా ఆదేశించాలని కోరారు. సీబీఐ కోర్టులోనే చార్జిషీట్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఫార్మా కంపెనీలకు సంబంధించి అన్ని చార్జిషీట్లు సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయినా.. ఒక్కటి మాత్రం బదిలీ కాలేదు. దీనికి సంబంధించి మళ్లీ జగన్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. చార్జ్ షీట్‌లన్నీ వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.