Begin typing your search above and press return to search.
సుప్రీంకోర్టు టార్గెట్ హిందువులా? - గవర్నర్!
By: Tupaki Desk | 10 Oct 2017 2:13 PM GMTదేశ రాజధానిలో కాలుష్యం పెరిగిపోతున్నదంటూ ఈ ఏడాది దీపావళికి పటాకుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఆదేశాలపై దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నెటిజన్లు నిషేధాన్ని సమర్థిస్తూ...వ్యతిరేకిస్తూ తమదైన శైలిలో అభిప్రాయాలు వినిపిస్తున్నారు. అయితే త్రిపుర గవర్నర్ తధాగథారాయ్ ఈ అంశంపై తనదైన శైలిలో సంచలన కామెంట్లు చేశారు. పటాకులపై నిషేధం తర్వాత ఇక హిందువుల అంత్యక్రియలపై నిషేధం ఉంటుందేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
`` సుప్రీంకోర్టు హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తోంది. అవార్డులు వెనక్కిస్తున్న వారు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించే వారు రేపు హిందువుల అంత్యక్రియలపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారేమో`` అని గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం రేగాయి. అయితే తధాగథారాయ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. పటాకులను కాల్చడంపై నిషేధం విధించడంతో హిందువులు సంతోషంగా లేరని ఆయన అన్నారు. ``నేను రాజ్యాంగానికి లోబడే ఈ వ్యాఖ్యలు చేస్తున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం` అని చెప్పారు. దీపావళికి పటాకులు పేల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుందన్న విషయంపై స్పందిస్తూ ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే దీపావళితోనే కాలుష్యం ఏర్పడుతుందా అని ప్రశ్నించారు.
మరోవైపు దీపావళికి పటాకులు అమ్మొద్దంటూ సుప్రీంకోర్టు విధించిన నిషేధంపై ట్విట్టర్ లో ఇంకా చర్చ నడుస్తూనే ఉన్నది. తాజాగా ప్రముఖ రచయిత చేతన్ భగత్ కూడా దీనిపై తన నిరసనను తెలిపారు. పటాకుల అమ్మకం నిషేధాన్ని సమర్థిస్తున్నవారికి ట్విట్టర్ లో కొన్ని సూటి ప్రశ్నలు సంధించాడు. ``హిందూ మతానికి చెందిన పండగలపైనేనా మీ ప్రతాపం.. మొహర్రం రోజు జరిగే రక్తపాతాన్ని ఆపే దమ్ముందా?`` అంటూ ప్రశ్నించాడు. పటాకులపై నిషేధం అంటే క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ ట్రీలు - బక్రీదు సమయంలో గొర్రెల బలిపై నిషేధించినట్లు ఉందని, ఏదైనా నియంత్రించండి తప్ప నిషేధం వద్దని సూచించారు. నిషేధానికి మద్దతుగా కొందరు చేసిన ట్వీట్లకు కూడా చేతన్ సమాధానమిచ్చాడు. ``మీకు కాలుష్య నియంత్రణపై అంత శ్రద్ధ ఉంటే కార్లు వాడకండి.. ఓ వారం రోజులు ఇంట్లో కరెంటు వాడకండి.. అంతేగానీ ఏడాదిలో ఒక్క రోజు జరిగే దీపావళి పండుగ వల్లే కాలుష్యం పెరిగిపోతుంది అని ఎలా అంటారు? అని నిలదీశాడు. అతని సూటి ప్రశ్నలతో ట్విట్టర్ లో పటాకుల నిషేధంపై చర్చ మరింత రాజుకోవడం గమనార్హం.