Begin typing your search above and press return to search.

కేసీఆర్‌..జ‌గ‌న్ త‌దిత‌రుల‌కు సోనియా లేఖ‌ల రాయ‌బారం

By:  Tupaki Desk   |   15 May 2019 6:21 AM GMT
కేసీఆర్‌..జ‌గ‌న్ త‌దిత‌రుల‌కు సోనియా లేఖ‌ల రాయ‌బారం
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల అంకం చివ‌ర‌కు వ‌చ్చేసిన వేళ‌.. దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు కొత్త రూపును సంత‌రించుకుంటున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ మోడీ అధిక్య‌త త‌ప్ప‌ద‌న్న స్థానే.. మోడీషాల‌కు ఈసారి ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వ‌న్న భావ‌న అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత మేల్కొనే క‌న్నా.. ముందు మోడీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టే ప‌ని ఇప్పుడు జోరుగా సాగుతోంది.

బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ షురూ చేసిన జ‌ట్టు క‌ట్టే ప్ర‌క్రియ ఒక ప‌క్క‌న సాగుతుంటే.. మ‌రోవైపు ఊహించ‌ని విధంగా యూఏపీ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ తాజాగా త‌న మిత్ర‌ప‌క్షాల‌తో పాటు.. యూపీఏలో భాగ‌స్వామ్యం లేని పార్టీల‌కు లేఖ‌లు రాసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మోడీకి చెక్ పెట్ట‌ట‌మే ల‌క్ష్యంగా మారిన వేళ‌.. సోనియా ఒక్క‌సారిగా యాక్టివ్ అయ్యారు.

యూపీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో పాటు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. బీజేడీ అధినేత బిజు ప‌ట్నాయ‌క్ త‌దిత‌ర యూపీఏ ప‌క్షానికి సంబంధం లేని ప్రాంతీయ పార్టీల‌కు ఇన్విటేష‌న్ పంపిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే వ‌ర‌కూ వెయిట్ చేసే క‌న్నా.. ఫ‌లితాల ముందే జ‌ట్టు క‌ట్టేయ‌టం ద్వారా మోడీషాల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో సోనియా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే రోజునే ఒక స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు.దీనికి యూపీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు హాజ‌రు కానున్నాయి. అదే స‌మ‌యంలో ఎన్డీయే పార్టీకి సానుకూలంగా ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న పార్టీల‌కు సైతం సోనియాగాంధీ లేఖ‌లు పంపారు. ఇందులో స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని కోరారు. యూపీఏ.. నాన్ యూపీఏ ప‌క్షాల‌తో నిర్వ‌హించే తాజా స‌మావేశాన్ని చూస్తే ఎట్టి ప‌రిస్థితుల్లో మోడీ మాష్టారికి మ‌రోసారి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతూ డీఎంకే అధినేత స్టాల‌న్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌వ‌టం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా త‌మ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా కోర‌టం.. తాను కాంగ్రెస్ ప‌క్షాన ఉంటాన‌ని తేల్చి చెప్ప‌టంతో పాటు.. కేసీఆర్ ను సైతం కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇవ్వొచ్చు క‌దా? అని అడ‌గ‌టం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ తో పాటు ప‌లువురు నాన్ యూపీఏ ప‌క్ష అధినేత‌ల‌కు సోనియా లేఖలు రాయ‌టం విశేషం. చూస్తుంటే.. మోడీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో కూట‌మి ఏర్పాటు దిశ‌గా అడుగులు వేగంగా ప‌డుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.