Begin typing your search above and press return to search.

నోరు జారిన కాంగ్రెస్ ఎంపీ... సోనియా చీవాట్లు...!

By:  Tupaki Desk   |   6 Aug 2019 1:31 PM GMT
నోరు జారిన కాంగ్రెస్ ఎంపీ... సోనియా చీవాట్లు...!
X
జమ్మూ-కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ-కశ్మీర్ ని విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ - అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఉండనుంది. ఇక పెద్దల సభ జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు-2019’కు ఆమోద ముద్ర వేసింది.

సోమ‌వారం సాయంత్రం డివిజన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో 64 ఓట్ల మెజార్టీతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు - వ్యతిరేకంగా 61 మంది ఓట్లు వేయగా.. ఒక సభ్యుడు తటస్థంగా ఉన్నారు. ఇక జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఈరోజు లోక్ సభ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా లోక్ సభలో బిల్లుపై చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ సహ కొన్ని పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ....బీజేపీపై విమర్శలు వర్షం కురిపించారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ - ప్రతిపక్ష నేత అధీర్ చౌదరి బీజేపీపై విమర్శించే భాగంగా నోరు జారి..అధినేత్రి సోనియా గాంధీ ఆగ్రహానికి గురయ్యారు. కశ్మీర్‌ కేవలం భారత్‌ అంతర్గత వ్యవహారం కాదని అధీర్‌ మాట్లాడటంతో లోక్‌ సభలో దుమారం రేగింది. దీంతో అధీర్ పై సోనియా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోనియా పర్సనల్ గా కూడా చీవాట్లు పెట్టారు.

అటు అధీర్ వ్యాఖ్యలపై బీజేపీ ట్విట్టర్ లో ఫైర్ అయింది. అధీర్ చౌదరి జమ్ము కశ్మీర్ పై మాట్లాడినా మాటలు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యనా లేక కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇదే వైఖరితో ఉందా ? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరింది. అసలే కశ్మీర్ విభజనని వ్యతిరేకించి అందరి నుంచి విమర్శలు ఎదురుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు... అధీర్ చేసిన వ్యాఖ్యలు తలనొప్పిగా తయారయ్యాయి. మొత్తానికి కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ ఇంకా కొత్త కష్టాలు కొనితెచ్చుకుంటునే ఉంది.