Begin typing your search above and press return to search.

టీడీపీ, జనసేన పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   26 Jan 2023 3:14 PM GMT
టీడీపీ, జనసేన పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ ఆయా పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని చెబుతున్న పవన్‌ కల్యాణ్‌ పై అందరి కళ్లూ నిలిచాయి.

ప్రస్తుతం ఏపీలో జనసేన–బీజేపీల మధ్య పొత్తు ఉంది. అయితే ఇటీవల కాలంలో పవన్‌ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీని గందరగోళానికి గురి చేస్తున్నాయని అంటున్నారు. 2014లో కూటమిగా ఉన్నట్టు మరోసారి జనసేన–టీడీపీ–బీజేపీ కలసి పోటీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారని.. అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోదని పవన్‌ భావిస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు బీజేపీ మాత్రం వైసీపీ, టీడీపీ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలని చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలతో కలసి సాగేది లేదని తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని.. 2024లో ప్రభుత్వాన్ని కలిసి తాము ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరి టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై వస్తున్న ప్రచారంపై స్పందించాలని కోరగా ఆ విషయాన్ని పవన్‌ నే అడగాలని సోము వీర్రాజు సూచించారు. ఈ మేరకు రాజమండ్రిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

పరిశ్రమల ఏర్పాటుకి రాష్ట్రంలో ఒక్క పాలసీ కూడా లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్ర పాలసీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సరైన దిశ దశ లేక పోవడానికి కుటుంబ రాజకీయాలే కారణమని సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.

తిరుమలలో గదులకు అద్దె రేట్లు పెంచడాన్ని నిరశిస్తూ టీటీడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. ఏపీలో బీజేపీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే... మిగిలిన పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తమ పార్టీ చేసే సంక్షేమం ముందు జగన్‌ చేసే సంక్షేమం బలాదూర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

సంక్షేమంపై దమ్ముంటే జగన్, చంద్రబాబు చర్చకు రావాలని సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. రేషన్‌ బియ్యం పంపిణీ కోసం ప్రతి కిలోకి రూ.38 కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. రేషన్‌ బియ్యం పంపిణీ వాహనాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో వేయాలని డిమాండ్‌ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.