Begin typing your search above and press return to search.

టీడీపీ రాజుగారి గురించి బీజేపీ రాజుగారు ఏం చెప్పారు బాస్‌!

By:  Tupaki Desk   |   22 Jun 2021 8:44 AM GMT
టీడీపీ రాజుగారి గురించి బీజేపీ రాజుగారు ఏం చెప్పారు బాస్‌!
X
రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు.. సోము వీర్రాజు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా టీడీపీ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌.. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు గురించే కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి టీడీఈ అంటే.. ఉప్పు-నిప్పు మాదిరిగా విమ‌ర్శ‌లు గుప్పించే సోము వీర్రాజు.. తాజాగా అశోక్ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న‌ను ఆకాశానికి ఎత్తేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారంపై హైకోర్టు తీర్పు అనంత‌రం.. ఆ ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు.

దొంగ‌లు-దోపిడీదారులు అంటూ.. మేక‌పాటి గౌతం రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే..ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ రియాక్ట్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, టీడీపీ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్‌.. సోము వీర్రాజు ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు. మంత్రి మేక‌పాటి పేరును ఎత్త‌కుండానే... ఆయ‌న వైసీపీ నేత‌ల దుమ్ము దులిపేశారు. ``రాజ‌కీయాల్లో ఉన్నాం క‌దా.. అని నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌డం స‌రికాదు. అయినా.. అశోక్ గ‌జ‌ప‌తిరాజు గురించి ఆయ‌న ఫ్యామిలీ గురించి.. ఏం తెలుస‌ని ఆయ‌న‌ను దొంగ అంటున్నారు? కొబ్బ‌రి బొడాలు ఎత్తుకెళ్లేవాడూ.. సైకిల్ బెల్లులు దొంగ‌తనం చేసేవాడూ రాజు గారి గురించి మాట్లాడ‌డం దారుణం`` అన్నారు సోము.

అంతేకాదు.. ``విజయ‌న‌గ‌రం జిల్లాలో కొన్ని ద‌శాబ్దాలుగా గ‌జ‌ప‌తుల కుటుంబం రాజ‌కీయాలు చేస్తోంది. వారిది ఇచ్చే చెయ్యే కానీ, పుచ్చుకునేది కాదు. మాకు కూడా ఎన్నోఏళ్లుగా అశోక్ గ‌జ‌ప‌తి రాజు తెలుసు. అస‌లు ఏజీ రాజు గారు వ‌స్తున్నారంటే.. ఇప్ప‌టికీ.. నేల‌పై చీర‌లు ప‌రిచి న‌డిపిస్తారు ప్ర‌జ‌లు. అంత‌టి అభిమానాన్ని రాజుగారు సొంతం చేసుకున్నారు. పార్టీలు పార్టీలే.. అది వేరు ఇలాంటి స‌మయంలో నీతి వంత‌మైన నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు ఖండించాల్సిందే. దొంగ‌లు వ‌చ్చి.. దొర‌ల‌ను విమ‌ర్శించ‌డం ఎక్క‌డా చూడ‌లేదు. ఇక్క‌డే చూస్తున్నాం. ఇప్ప‌టికైనా ఇలాంటి విమ‌ర్శ‌లు మానుకోవాలి. ఈ విష‌యంలో బీజేపీ రాజుగారివైపే ఉంటుంది`` అని సోము స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్యాఖ్య‌లు జ‌గ‌న్‌కు, ఆయ‌న మంత్రివ‌ర్గానికి వినిపించాయో లేదో.. చూడాలి!