Begin typing your search above and press return to search.

బీజేపీకి అసలైన విలన్ బాబే... సోము లేఖ లీక్ అయిందా...?

By:  Tupaki Desk   |   28 Feb 2023 6:00 PM GMT
బీజేపీకి అసలైన విలన్ బాబే... సోము లేఖ లీక్ అయిందా...?
X
ఏపీ బీజేపీకి అసలైన విలన్ చంద్రబాబే అని ఏపీ బీజేపీ నేతలు తీర్మానించారా. ఆ సంగతినే కేంద్రమో అధికారంలో ఉన్న పెద్దల చెవిన వేశారా. ఏపీలో బీజేపీ ఎందుకు ఎదగడంలేదు అంటే మాకు ఇక్కడ బాబు ఉన్నారు. ఆయనే అడ్డుకుంటున్నారు అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారా.

ఇంతకీ మ్యాటర్ ఏంటి, ఏపీ బీజేపీకి చంద్రబాబుకు సంబంధం ఏంటి అంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తాజాగా తమ పార్టీ కేంద్ర నాయకత్వానికి ఒక లేఖ రాశారని పార్టీలో గుసగుసలు పోతున్నారు. అందులోని విషయం అంతా లీక్ అయిందని కూడా ప్రచారం సాగుతోంది. ఏపీ బీజేపీని పటిష్టపరచడం కోసం తాను ఎంతగానో కృషి చేస్తున్నాను అని కేంద్ర పెద్దల సూచనలతో తాను కష్టపడుతూంటే మధ్యలో చంద్రబాబు వచ్చి అంతా పాడుచేస్తున్నారు అన్నట్లుగా సోము వీర్రాజు కేంద్రానికి రాసిన ఘాటైన లేఖలో చాలా చెప్పారని అంటున్నారు.

ఈ విషయం కూడా తిరుపతికి చెందిన ఒక బీజేపీ ముఖ్య నాయకుడు అసలు గుట్టు లీక్ చేశారని అంటున్నారు. ఏపీలో టీడీపీ యుద్ధం రెండు విధాలుగా సాగుతోంది అన్నది తెలిసిందే. ఒక యుద్ధం వైసీపీ మీద బాహాటంగా చేస్తూంటే రెండవ యుద్ధం బీజేపీలో ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ మీద చేస్తోంది అన్నది కూడా చెప్పుకుంటున్నారు. ఏపీ బీజెపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజు ఉన్నారు.

ఆయన వైసీపీని టీడీపీని రెండింటినీ కలిపి విమర్శలు చేస్తూ వస్తున్నారు. రెండూ కుటుంబ పార్టీలు అని ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్నరు. బాబు జగన్ ఇద్దరూ అమరావతి రాజధానిని కట్టలేకపోయారని కూడా విమర్శిస్తూంటారు. ఈ నేపధ్యంలో బీజేపీలో నిన్నటిదాకా ఉంటూ టీడీపీలోకి చేరిపోయిన కన్నా లక్ష్మీనారాయణ సైతం సోము వీర్రాజు మీద విమర్శలు చేసి వేళ్ళారు.

ఏపీ బీజేపీలో ఏమి జరుగుతోంది అంటూ కేంద్ర పెద్దలు కూడా ఆరా తీయడం మొదలెట్టారు. ఈ క్రమంలో సోము వీరాజు ఏపీ బీజేపీ గురించి వాస్తవాలు తన దృష్టి కోణంలో తనదైన శైలిలో వివరిస్తూ కేంద్ర పెద్దలకు లేఖ రాశారని అంటున్నారు. కేంద్ర పెద్దల డైరెక్షన్ ప్రకారం తాను ఎంతలా కష్టపడుతున్నా కూడా చంద్రబాబు బీజేపీని బతకనీయడం లేదు అన్నట్లుగా సోము ఆ లేఖలో రాశారని అంటున్నారు.

తమ పార్టీ నుంచి కన్నాను తీసుకెళ్ళి జాయిన్ చేసుకున్న టీడీపీ పెద్దలు మరింతమంది లీడర్స్ ని కూడా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోందని కూడా పేర్కొన్నారుట. అలా వెళ్ళిపోయే నేతల జాబితాను కూడా కేంద్ర పెద్దలకు ఆయన తెలియచేశారు అని అంటున్నారు.

చంద్రబాబు తమ పార్టీ నాయకులకు పదవుల ఆశ చూపించి మరీ లాగేస్తున్నరని, ఇలాగైతే పార్టీ బతకడం కష్టమని కూడా సోము తేల్చేశారు అన్న విషయమే ఇపుడు కలకలం రేపుతోంది. తాను ఇప్పటికే ఏపీ పార్టీ విషయంలో చాలా నివేదికలు ఇచ్చానని, కేంద్ర పెద్దలు చెప్పినట్లుగా తాను ఎంత చేస్తున్నా చంద్రబాబు మాత్రం ఏపీ బీజేపీ మీద టార్గెట్ చేసి వీక్ చేసి పారేస్తున్నారు అని సోము ఆ లేఖలో గుట్టు అంతా చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇక్కడ సోము మరో మాట కూడా చెప్పారని అంటున్నారు. ఏపీలో అధికార వైసీపీతో బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని, సంస్య అంతా బాబుతోనే అని కుండబద్ధలు కొట్టేశారు అని అంటున్నారు. దీని మీదనే బీజేపీలో ఇపుడు అంతా గుసగుసలు పోతున్నారుట. నిజంగా ఇలాంటి లేఖ సోము రాశారా అంటే తిరుపతికి చెందిన ఆ నేత మాత్రం మా పార్టీ పరిస్థితి అయితే అసలు బాలేదు, ఎటు పోతోందో తెలియడం లేదు అని అనడం విశేషంగా ఉంది.

అంతే కాదు పార్టీతోనే ఉంటూ నమ్మించి వెన్నుపోటు పొడుస్తున్న నాయకులు ఎక్కువ అయ్యారు. వారితోనే పార్టీ ఇబ్బ్బందులు పడుతోంది అని సదరు నాయకుడు చెప్పడం బీజేపీలోని అసలైన వాతావరణాన్ని తెలియచేస్తోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయాల మీద కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలని అంటున్నారు. సోము రాసిన లేఖలో విషయాలు ఇవి అంటూ లీక్ అవుతున్నవన్నీ నిజమైతే మాత్రం ఏపీ బీజేపీ మీద కేంద్రం మూడవ కన్నే తెరుస్తుంది అంటున్నారు. మరి ఆ కన్ను స్వపక్షం మీద లేక విపక్షం మీద అన్నదే చూడాలని అంటున్నారు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.