Begin typing your search above and press return to search.

'స్మార్ట్' ఫోన్ ఫోబియా.. దేశంలో ప్రతీ నలుగురిలో ముగ్గురికి..

By:  Tupaki Desk   |   7 May 2023 1:25 PM GMT
స్మార్ట్ ఫోన్ ఫోబియా.. దేశంలో ప్రతీ నలుగురిలో ముగ్గురికి..
X
స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించలేం. ఎందుకంటే ఫోన్ తోనే అంతా నడుస్తున్న కాలం ఇదీ. ఫోన్ నే ప్రపంచంగా భావించి ఇంటిపని..వంటపని.. ఆఫీసు పనులన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారానే చేసేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకుండా అసలు ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితులు వచ్చేశాయి. ఫోన్ కనిపించకపోయినా.. బ్యాటరీ అయిపోయినా.. వెంటనే మీలో ఆ టెన్షన్ పెరిగిపోతోందా? అయితే మీరు ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు లెక్క.

భారత్ లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుందని తాజాగా 'ఒప్పో, కౌంటర్ పాయింట్' సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాను నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే 'నో మొబైల్' ఫోబియా అని అర్థం.

స్మార్ట్ ఫోన్ పనిచేయకపోయినా.. సిగ్నల్స్ లేకపోయినా.. కనిపించకపోయినా.. బ్యాటరీ అయిపోయినా కూడా విపరీత మైన ఆందోళనకు గురికావడం ఈ ఫోబియా ముఖ్య లక్షణం. తర్వాత ఏదో కోల్పోయినట్టుగా ఉండడం.. నిస్సహాయంగా మారిపోవడం.. అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు.

బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60శాతం మంది ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లు మార్చేస్తున్నారని సర్వేలో తేలింది. ఫోన్ లేక పోతే మహిళలు 74శాతం మంది ఒత్తిడికి గురవుతున్నారు. పురుషులు ఏకంగా 82 శాతం మంది ఇలా అవుతున్నారు. బ్యాటరీ ఎక్కడ అయిపోతుందని 92శాతం మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ సేవింగ్ మోడ్ ను వినియోగిస్తున్నారు. ఛార్జింగ్ ఉండగా కూడా ఫోన్ వాడే వారు ఏకంగా87 శాతం మంది ఉండడం విశేషం.

భారతీయుల్లో ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో 1500 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారుల పై ఒప్పో ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ ఫోన్లనీ మార్చేవారు చాలా మంది ఉన్నారని.. ఒక రకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకు కూడా కీలకంగా మారిందని ఒప్పో చీఫ్ తెలిపారు.

స్మార్ట్ ఫోన్ లేకపోతే ఈరోజుల్లో పూట గడవదు. కానీ దాని వల్ల ఏర్పడుతున్న దుష్ప్రభావాలనుంచి బయటపడడానికి అందరూ ప్రయత్నించాలి.