Begin typing your search above and press return to search.

చెప్పు చెప్పు అంటున్న ఏపీ రాజకీయం

By:  Tupaki Desk   |   16 Jun 2023 7:00 PM GMT
చెప్పు చెప్పు అంటున్న ఏపీ రాజకీయం
X
ఏపీలో చెప్పుల రాజకీయం మోత మోగిస్తోంది. చెప్పులకు విలువ లేదా అంటే నిలువెత్తు మనిషిని ఏ ఇబ్బంది లేకుండా రక్షించేవి చెప్పులే. నడి రోడ్డున చెప్పు తెగిపోతే మనిషి పరువు పోతుంది అంటే వాటికి ఉన్న విలువ ఏపాటిదో అచ్చంగా తెలుస్తుంది. అలాంటి చెప్పులు రాముడు కాలంలో పీఠమెక్కి రాజ్యం కూడా చేశాయి. రాముడి పాదుకలను తెచ్చి భరతుడు సింహాసనం మీద ఉంచి పద్నాలుగేళ్ళు పాలించాడు.

అలా చెప్పులు పాలించిన చరిత్ర పురాణాల్లో ఉంది. చెప్పు తీసి కొడతాను అంటే దిగజారినట్లే. ఎవరైనా ఆ మాట వాడకూడదు. ఇప్పటికి కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫీసులో చెప్పు తీసి చూపించారు. అప్పట్లో అది సంచలనం అయింది. చెప్పులు తీయడమేంటి అని పవన్ పాలిటిక్స్ మీద విమర్శలూ వచ్చాయి.

అయితే పవన్ని అలా ఉండనీయకుండా రక్షించేసింది వైసీపీ. ఆ చెప్పుల కధను మరింతగా పెంచి ముందుకు తీసుకుని పోయింది. మీకేనా చెప్పులు ఉండేవి మాకూ ఉన్నాయని వైసీపీ మంత్రులు నాడూ గర్జించారు. అలా ఆ చెప్పులో ఎపిసోడ్ లో దొందు దొందే అన్నట్లుగా వారూ వీరూ చేసుకున్న విమర్శలతో రాజకీయాలే ఇంత అనుకున్నారు జనాలు.

అయితే వారాహి రధమెక్కిన తరువాత మరోమారు పవన్ కళ్యాణ్ పాత ఎపిసోడ్ ని కెలికారు. నేను చెప్పు చూపించాను కాబట్టే అధికార పార్టీ కాస్తా తగ్గి ఉంది అన్నట్లుగా ఆయన మాట్లాడేశారు. దానికి మండిపోయిన మాజీ మంత్రి పేర్ని నాని మీడియా మీటింగులో ఏకంగా రెండు చెప్పులు చూపించారు. వైసీపీ నేతల మక్కెలిరగతంతామని పవన్ అనడమేంటి, మాకు లేవా చెప్పులు, మేము మక్కెలిరగతన్నలేమా అని రెచ్చిపోయారు.

ఇలా చెప్పుల రాజకీయం ఏపీలో వెగటుగా జుగుప్సాకరంగా సాగుతోంది. చెప్పు తీయడమేంటి పవన్ అంటూ అంబటి రాంబాబు సుద్దులు చెబుతూనే తమకూ చెప్పులు ఉన్నాయని అనడమే వేడిని పెంచే విషయంగా ఉంది. నీవు ఒక చెప్పు చూపిస్తే మేము రెండు చెప్పులు చూపిస్తాం, నీవు రెండు చెప్పులు చూపిస్తే మేము నాలుగు చూపిస్తామని లెక్క కట్టి మరీ అంబటి అనడం ఏపీ రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్ధం కాని పరిస్థితి.

పవన్ కళ్యాణ్ అయితే రాజకీయ అనుభవం తక్కువ ఉన్న వారు అని వైసీపీ నేతలు అంటారు.మరి దశాబ్దాల అనుభవం ఉన్న వైసీపీ నేతలు కూడా చెప్పులు చూపిస్తూ మాట్లాడడమేంటి. పెద్ద మగాళ్ళం అనడమేంటి, ఏమీ పీకలేవు అని సవాళ్ళు చేయడమేంటి. అసలు ఎటు పోతోంది ఈ రాజకీయం అనిపించకమానదు.

ఇక పేర్ని నాని కామెంట్స్ మీద జనసేన క్యాడర్ నిరసన తెలియచేయడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. తనను నానా మాటలు అంటున్న వారొ ఏదో రోజు చింతిస్తారు అని పవన్ అనడమూ కొసమెరుపే. ఇప్పటికే ఏపీ రాజకీయాన్ని నాయకుల మాటలను చూసి జనాలు బోలెడు చింతిస్తూనే ఉన్నారు. ఇంకా ఈ పాలిటిక్స్ దిగజారకూడదు అని అనుకుంటున్నారు.

ఇంతకీ చెప్పులకు ఏ పాటి విలువ లేదు అని రాజకీయ నాయకులు అనుకుంటున్నారా అన్నదే ప్రశ్న. చెప్పులు లేకుండా బయటకు రాలేని మనిషికి ఆ విలువ ఎంతో తెలుసు. అలాంటి చెప్పులను చూపిస్తూ చీప్ పాలిటిక్స్ చేద్దామనుకున్నా చెప్పులకు ఏమీ కావు అంటున్నారు. అవి ఎపుడూ పాద రక్షలే వాటిని మధ్యలోకి తీసుకొచ్చిన నేతలే ఏ రాజకీయ రక్షణా లేకుండా ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారేమో జర జాగ్రత్త అంటున్నారు అంతా.