Begin typing your search above and press return to search.

ఎవ‌రీ హ‌ర్షితా ద‌హియా?

By:  Tupaki Desk   |   19 Oct 2017 8:10 AM GMT
ఎవ‌రీ హ‌ర్షితా ద‌హియా?
X
సింగ‌ర్‌ హర్షితా దహియాని మంగ‌ళ‌వారం సాయంత్రం దారుణ హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ శివార్ల‌లో గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఆమెపై కాల్పులు జ‌ర‌ప‌డంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఢిల్లీలోని నారెల్లా ప్రాంతంలో ఓ స్టేజి షోలో పాల్గొన్న ఆమె తిరిగి పానిపట్ కు వెళ్తుండగా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. దహియాపై దుండ‌గులు ఏడు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ఆమె తల - గొంతులో ఆరు బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ స‌మ‌యంలో ఆమెతో పాటు కారులో ఇద్ద‌రు అసిస్టెంట్లు, డ్రైవ‌ర్ ఉన్నారు. దుండ‌గులు వారిని కారులోనుంచి దింపివేసి ద‌హియాపై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ప‌థ‌కం ప్ర‌కార‌మే ఇద్ద‌రు దుండ‌గులు ఆమె కారును ఓవ‌ర్ టేక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత అత్యంత సమీపం నుంచి హ‌ర్షితపై కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత నిందితులు అక్క‌డ నుంచి పారిపోయిన‌ట్లు వారు తెలిపారు. త‌న‌ సోద‌రి ల‌త‌ భ‌ర్త దినేష్ పై హ‌ర్షిత రేప్ కేసు పెట్ట‌డం, 2014లో జ‌రిగిన ఆమె త‌ల్లి హత్య కేసులో కూడా హ‌ర్షిత కీల‌క‌మైన సాక్షి కావ‌డం వంటి నేప‌థ్యంలో ఈ హ‌త్య జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. హ‌ర్షిత‌ను కూడా తీహార్ జైల్లో ఉన్న త‌న‌ భ‌ర్త దినేష్ హ‌త్య చేయించి ఉంటాడని ఆమె సోద‌రి ల‌త ఆరోపించింది. హ‌ర్షిత పై రేప్ కేసు - ఆమె త‌ల్లి హత్య కేసుతోపాటు దినేష్ అనేక క్రిమిన‌ల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడ‌ని పానిప‌ట్ డీఎస్పీ దేశ్ రాజ్ తెలిపారు.

హ‌ర్యానాలోని సోనిప‌ట్ లో 1994లో హ‌ర్షితా ద‌హియా జ‌న్మించింది. ద‌హియా.... హ‌ర్యానీ ఫోక్ సింగ‌ర్‌ - స్టేజీ డ్యాన్స‌ర్ గా బాగా ఫేమ‌స్‌. రాగిణి సాంగ్స్ కు అద్భుతంగా ప‌ర్ ఫార్మ్ చేసే ద‌హియాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె త‌ర‌చూ త‌న సెల్ఫీలు - ఫొటోలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె ప్ర‌స్తుతం ఢిల్లీలోని న‌రేల ప్రాంతంలో నివాసముంటోంది. ఆమెకు త‌న త‌ల్లి అంటే చాలా ఇష్టం. ఆమె శ‌రీరంపై త‌ల్లిప్రేమ‌కు సంబంధించిన టాటూలు ఉన్నాయి. త‌న‌కు త‌న ఇండ‌స్ట్రీ నుంచి, హ‌ర్యానా స్టేజి ఆర్టిస్ట్ ల నుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో లైవ్ వీడియో చేసిన సంద‌ర్భంగా చెప్పింది. ఆ వీడియోను డిలీట్ చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని హెచ్చ‌రించార‌ని చెప్పింది. తాను జాట్ ల వంశానికి చెందిన అమ్మాయిన‌ని, అటువంటి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌న‌ని వీడియోలో చెప్పింది.