Begin typing your search above and press return to search.

టీడీపీ నుంచి పోటీ చేస్తారనే అర్జా శ్రీకాంత్‌ను టార్గెట్ చేశారా?

By:  Tupaki Desk   |   10 March 2023 6:11 PM GMT
టీడీపీ నుంచి పోటీ చేస్తారనే అర్జా శ్రీకాంత్‌ను టార్గెట్ చేశారా?
X
స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్కాంలో కీలక‌పాత్ర పోషించారని ఆరోపణలున్న భాస్కర్‌ను సీఐడీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఆయన రిమాండ్‌ని మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. మ‌రోవైపు మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ ను సుదీర్ఘంగా విచారించారు. కాగా అర్జా శ్రీకాంత్‌ను సీఐడీ వేధిస్తోందని.. ఆయన్నేమైనా చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే బోండా ఉమ, పయ్యావుల కేశవ్, కన్నా లక్ష్మీనారాయణ వంటివారు అర్జా శ్రీకాంత్‌కు అండగా నిలిచారు.

గ‌త ప్రభుత్వ హ‌యాంలో నైపుణ్య శిక్షణ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జ‌రిగాయ‌నేది సీఐడీ ఆరోప‌ణ‌. ఇక్కడి నుంచి నిధులు టీడీపీ నేతల ఖాతాల్లోకి వెళ్లాయని వైసీపీ ఆరోపిస్తోంది. సీమెన్స్‌ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు.. ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. GGHలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా సీఐడీ కోర్టుకు తరలించారు.

ఈ కేసులో ఐఆర్‌టిఎస్‌ మాజీ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ గురువారం విచారణకు హాజరయ్యారు. శుక్రవారం కూడా ఆయన విచారణ కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్ ఎండీగా 2019 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకూ శ్రీకాంత్ పని చేశారు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 160 కింద శ్రీకాంత్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా దిల్లీలోని ఏపీ భవన్‌లో గతంలో పనిచేసిన శ్రీకాంత్‌‌కు 2019 ఎన్నికలకు ముందు స్కిల్ డెవలప్మెంట్ బాధ్యతలు అప్పగించారు.

కాగా 2019 ఎన్నికలలో శ్రీకాంత్ మచిలీపట్నం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ.. సమీకరణాలు కుదరక ఆయనకు టికెట్ రాలేదు. ప్రస్తుతం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన మళ్లీ క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఎన్నికలలో పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన పట్ల టీడీపీ, జనసేన రెండూ సానుకూలంగా ఉన్నాయంటున్న నేపథ్యంలోనే ఆయన్ను ఈ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.