Begin typing your search above and press return to search.

భారీగా తగ్గిన సింగపూర్ జనాభా .. ఎంతంటే ?

By:  Tupaki Desk   |   30 Sep 2021 12:30 AM GMT
భారీగా తగ్గిన సింగపూర్ జనాభా .. ఎంతంటే ?
X
సింగపూర్ జనాభా గతంలో ఎన్నడూ లేని విధంగా 4.1 శాతం తగ్గింది. ఈ ఏడాది జూన్ నాటికి దేశ జనాభా 54.5 లక్షలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కరోనా వైరస్ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. 1970లో జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టిన తర్వాత ఈ రకంగా జనాభా సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారని ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ ప్రయాణ ఆంక్షలతోపాటు అస్థిరమైన ఆర్థిక వాతావరణం కారణంగా విదేశీ ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో ప్రవాసుల జనాభాలో క్షీణత ఏర్పడిందని నేషనల్ పాపులేషన్ అండ్ టాలెంట్ డివిజన్ తన వార్షిక జనాభా నివేదికలో తెలిపింది. శాశ్వత నివాసులు జనాభాలో 0.7 శాతం తగ్గుదల ఉండగా ప్రవాసుల జనాభా 10.7 శాతం తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. దాదాపు 14.7 లక్షల ప్రవాసుల జనాభా తగ్గినట్లు పేర్కొన్నారు.

దేశం చూస్తే చాలా చిన్నది.. అదీ ఓ ద్వీపం. అంతా కలిపి 278 చదరపు మైళ్లు దాటదు. జనాభా కేవలం 56 లక్షలు, ఇంచుమించుగా హైదరాబాద్‌లో సగం జనాభా, కానీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందీ ఆగ్నేయాసియా దేశం. బడ్జెట్‌ లో మిగులును ప్రజలకు బోన్‌ సగా ఇస్తోంది. ఇది ఎలా సాధ్యమైంది, ఏంటి వారి జీవన ప్రణాళిక? సింగపూర్‌ స్వేచ్ఛా వాణిజ్యానికి పెట్టింది పేరు. అవినీతి, ఆంక్షల రహితం. వ్యాపార అనుకూలం. అందుకే సింగపూర్‌ వైపు అనేక ప్రపంచ కంపెనీలు దృష్టి సారించాయి. ఉభయులకూ లాభదాయకమైన రీతిలో ఉండాలన్న లక్ష్యంతో- స్థానిక పౌరులకు అంటే సింగపూర్‌ యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాలు ఉంటాయి. అందుకే సింగపూర్‌లో నిరుద్యోగం కేవలం 3 శాతం మాత్రమే.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్‌ది ఏడో స్థానం. ఆసియా ఖండంలో చూస్తే దీనిది ఐదో స్థానం. విలాస జీవనం పెద్దగా సాధ్యపడదు. సింగపూర్‌ లో భూభాగం చాలా తక్కువ కాబట్టి సొంతంగా ఇళ్లు కట్టుకోవడం సాధ్యం కాదు. 80 మంది సింగపూర్‌ వాసులు ప్రభుత్వం రాయితీ మీద ఇచ్చే ఇళ్లలోనే ఉంటారు. ఇల్లు కొనాలంటే లక్ష డాలర్ల పైనే పెట్టాలి. అది కూడా నిర్దిష్ట కాలం వరకే, ఒంటరిగా ఉండేవారికి ఇల్లు కొనడానికి అనుమతి ఇవ్వరు. 35 ఏళ్లు దాటిన వారికే కొనే హక్కు. ఈ సమస్యలేవీ వద్దనుకుంటే.. 400 డాల ర్లు చెల్లిస్తే నగరం మధ్యలో సింగిల్‌ బెడ్రూం ఫ్లాట్‌ వస్తుంది. దానిలో హాయిగా అద్దెకు ఉండవచ్చు.

సింగపూర్‌ ఓ నియమబద్ధ దేశం. అక్కడ ఉన్నంత క్రమశిక్షణ, రుజువర్తన చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. నేతా గణంలో అవినీతి మచ్చుకైనా కానరాదు. ప్రజలూ అంతే, వ్యాపార దృక్పథం మెండు. సాంకేతికతను అభివృద్ధి చేయడంలో, పోటీపడడంలో వారికి వారే సాటి. తమకున్న ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకునే నైపుణ్యం వారికి ఎక్కువ. సింగపూర్‌ వాసుల జీవనశైలి కూడా ఆర్థిక పురోగతికి దోహదపడిందని చెప్పవచ్చు. ప్రజలు కష్టపడి పనిచేస్తారు. సింగపూర్‌ లో స్వాతంత్య్రం ఉన్నా పూర్తి స్వేచ్ఛ దక్కదు. చాలా ఆంక్షలుంటాయి. సైకిల్‌ తొక్కాలన్నా నిర్దిష్టమైన రోడ్లపై అదీ మార్కింగ్‌ ఉన్న ప్రాంతంలోంచే వెళ్లాలి. ఆ నిబంధన అతిక్రమిస్తే 1000 డాలర్లు జరిమానా కట్టాలి. చూయింగ్‌ గమ్‌, పాన్‌ మసాలా లాంటివి తిని రోడ్లపై ఉమ్మేయడం కుదరదు. సింగపూర్‌లో పనిమనుషులు చాలా ఎక్కువ. ఒక అంచనా ప్రకారం దాదాపు 2 లక్షల మందికి పైనే ఉంటారు. ఇన్నోవేషన్‌, నైపుణ్య శిక్షణ, సాంకేతికత, వాణిజ్య దృక్పథం పెంపు.. మొదలైన వాటిపై ఎక్కువ ఫోకస్‌ పెట్టి- యువతను ఆ దిశగా మళ్లించడం ద్వారా సింగపూర్‌ ప్రభుత్వం తమ దేశాభివృద్ధిని పరుగులు తీయిస్తోంది.