Begin typing your search above and press return to search.

ఎన్నికల వ్యూహకర్త కు సిద్ధరామయ్య బంఫర్‌ ఆఫర్‌!

By:  Tupaki Desk   |   1 Jun 2023 4:12 PM GMT
ఎన్నికల వ్యూహకర్త కు సిద్ధరామయ్య బంఫర్‌ ఆఫర్‌!
X
మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ 135 సీట్లు గెలుచుకుని సొంతంగా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్‌ మెజారిటీ మార్కును అధిగమించి సీట్లు సాధించింది. దీంతో ఎవరి మద్దతు అవసరం లేకుండానే సొంతంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీ కేవలం 66 సీట్లకే పరిమితం కాగా, మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వం లోని జేడీఎస్‌ 19 సీట్ల కు పరిమితమయింది. ఇక గాలి జనార్దన్‌ రెడ్డి కి చెందిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష, సర్వోదయ కర్ణాటక పార్టీ చెరొక సీటులో విజయం సాధించాయి.

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మరో 30 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపులో ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కీలక పాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త అయిన సునీల్‌ కనుగోలు కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చారు. సునీల్‌ ను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించారు. అంతేకాకుండా ఆయన కు కేబినెట్‌ మంత్రి హోదాను కట్టబెట్టారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు క్యాబినెట్‌ మంత్రి హోదాతో ముఖ్య సలహాదారుగా నియమితులైనట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

కాగా సునీల్‌ కనుగోలు కాంగ్రెస్‌ 'టాస్క్‌ ఫోర్స్‌ 2024' సభ్యుడుగా ఉన్నారు. అలాగే తెలంగాణ లో కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఆయనే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి సునీల్‌ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా నియమించుకుందని తెలుస్తోంది.

కాగా ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన మొత్తం ఐదు హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిద్ధరామయ్య చెప్పారు.

ఈ క్రమంలో ఐదు ప్రధాన హామీలయిన అన్ని గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌; ప్రతి కుటుంబంలో మహిళకు నెలవారీ రూ. 2,000 సహాయం, బీపీఎల్‌ కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల ఉచిత బియ్యం, నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌ యువకులకు ప్రతి నెల రూ. 3,000, పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ను అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ ఐదు ప్రధాన హామీల రూపకల్పనలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన ను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సిద్ధరామయ్య నియమించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.