ఆమె చెప్పినట్లే జరిగితే హైదరాబాద్ సంగతేమిటి?

Sat Oct 17 2020 13:20:55 GMT+0530 (IST)

What will happen to Hyderabad if what she says happens?

ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణను ఎంతలా కుదిపివేశాయో తెలియంది కాదు. అన్నింటికి మించి.. హైదరాబాద్ మహానగరానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.భారీ ఎత్తున కురిసిన వర్ష ప్రభావంతో చెరువులు కట్టలు తెగగా.. నాలాలు పొంగిపోర్లాయి. మొత్తంగా మహానగరం వరదనీటిలో మునకేసిన పరిస్థితి. ఇలాంటివేళ.. భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయంపై నిపుణులు కొందరు పరిశోధనలు చేశారు. బిట్స్ కు చెందిన పీహెచ్ డీ పరిశోధకురాలు స్వాతి కొంతకాలంగా హైదరాబాద్ వర్షాల మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఏడాది క్రితమే ఆమె ప్రచురించిన పత్రంలో 2020 నాటికి హైదరాబాద్ లో రోజులో 28 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందన్న మాటను ఆమె పేర్కొనటం.. తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకోవటం గమనార్హం.ఇదిలా ఉంటే.. రానున్న ఎనభై ఏళ్లలో ఎంత వర్షపాతం పడే వీలుంది. రోజులో అత్యధికంగా ఎంత వర్షం కురిసే వీలుందన్న విషయాల మీద ఆమె ఒక పరిశోధన పత్రాన్ని తీసుకొచ్చారు. అందులోని అంశాలు ఆసక్తికరంగానే కాదు.. ప్రభుత్వం ఈ అంశాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. ఆమె అంచనా ప్రకారం రానున్న రోజుల్లో ఒకే రోజు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

2040 నాటికి రోజులో 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే వీలుందని.. తర్వాతి రోజుల్లో అది 60 సెంటీమీటర్ల వరకు పెరిగే వీలుందన్న అంచనాను ఆమె వేశారు. ఆమె చెప్పినట్లు జరిగితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. భాగ్యనగరిని డిజైన్ చేసింది నాలుగైదు సెంటీమీటర్లకు తట్టుకునేలా మాత్రమే. అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. తాజాగా బిట్స్ పీహెచ్ డీ పరిశోధకురాలి మాటల నేపథ్యంలో.. భారీ వర్షాలకు సైతం నగరం తట్టుకునేలా వ్యవస్థల్ని.. మౌలికసదుపాయాల్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. అందుకు భారీగా ఖర్చు పడుతుంది. ఎప్పుడో ఒకసారి కురిసే వానల కోసం ఇప్పుడు ఇంత భారీగా ఖర్చు చేస్తారా? అన్నది ప్రశ్న. ఏమైనా భవిష్యత్తులో చోటు చేసుకునే నష్టాన్ని ముందే అంచనా వేసిన ఆమె మాటల్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.