Begin typing your search above and press return to search.

స‌జ్జ‌ల తెలివి: సొంత పార్టీ కుంప‌టినీ.. చంద్ర‌బాబుపైనే వేసేశారుగా!!

By:  Tupaki Desk   |   2 Feb 2023 9:08 PM GMT
స‌జ్జ‌ల తెలివి: సొంత పార్టీ కుంప‌టినీ.. చంద్ర‌బాబుపైనే వేసేశారుగా!!
X
వైసీపీ నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదం.. తిరిగి తిరిగి.. టీడీపీ వైపు మ‌ళ్లింది. వైసీపీ వ్యూహాత్మ‌కంగా త‌న సొంత కుంప‌టిని చ‌ల్లార్చుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌లేకో.. లేక రాజ‌కీయంగా దీనిని ఎదుర్కొన‌లేకో.. వ్యూహాత్మ‌కంగా టీడీపీని లాగే ప్ర‌య‌త్నం చేసింది. ``నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు`` అని ఆధారాల‌తో స‌హా చూపించిన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న వైసీపీ అధిష్టానం.. దీనిని చాలా ప‌క్కాగా డైవ‌ర్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేసింది.

ఈ క్ర‌మంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. త‌మ పార్టీ వ్య‌వ‌హారాన్ని.. త‌మ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోప‌ణ‌ల‌ను.. కూడా చంద్ర‌బాబుకు లింకు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కు కుట్ర పన్నింది చంద్రబాబేన‌ని ఆరోపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణల వెనక ఉన్న ఉద్దేశాలు ఎవరివో అందరికీ తెలుసన్నారు. అంతేకాదు.. అస‌లు ఈ వివాదంలో కేంద్రంగా ఉన్న కోటంరెడ్డికి ఎలాంటి విష‌యాలూ తెలియ‌వ‌ని చెప్పుకొచ్చారు.

ప్రజలకు మంచి చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారని, ఇటువంటి చిల్లర అంశాలు పట్టించుకునే సమయం తమకు లేదన్నారు. కోటంరెడ్డి ఆడియోను ఒకరు రికార్డు చేసి బయటకు పంపించారని, రికార్డు చేసిన వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాలని స‌జ్జ‌ల‌ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే కోటంరెడ్డికి ఎందుకు పంపిస్తారని ప్ర‌శ్నించారు. ఇదంతా చంద్ర‌బాబు ప్రణాళికేన‌ని చెప్పుకొచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఫిర్యాదు చేయవచ్చని, కానీ అది ట్యాపింగ్ కాదన్నారు. ఇంటిలిజెన్స్ చీఫ్ నుంచి మెసేజ్ వెళ్లిందని, దాన్ని ఎవరూ కాదనడంలేదని, ఆయన దృష్టికి ఓ ఆడియో వస్తే దానిని శ్రీధర్ రెడ్డికి పంపించారని స‌జ్జ‌ల‌ చెప్పారు. చంద్రబాబు నుంచి హామీ వచ్చిన తర్వాతే కోటంరెడ్డి టీడీపీ నుంచి పోటీచేస్తానని చెబుతున్నారని అన్నారు.

టీడీపీ, కోటంరెడ్డి ఇద్ద‌రూ కలిసి డ్రామాలాడుతున్నారని స‌జ్జ‌ల‌ మండిపడ్డారు. ట్యాపింగ్ కానప్పుడు విచారణ అవసరం లేదన్నారు. చంద్రబాబు హ‌యాంలోనే ట్యాపింగ్‌లు జరిగాయని, తమకు చాలా పనులున్నాయని, వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయని, వాటిపైనే తాము దృష్టి సారించామని, ఇలాంటి ట్యాపింగ్ లు చేయాల్సిన అవసరం లేద‌ని స‌జ్జ‌ల చెప్పుకొచ్చారు. అయితే.. వాస్త‌వానికి ఇది వైసీపీ వ‌ర్సెస్ సొంత నేత స‌మ‌స్య‌. దీనిలో టీడీపీని ఎందుకు లాగుతున్నార‌నేది ప్ర‌శ్న‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.