Begin typing your search above and press return to search.

రూ.101 మ‌నియార్డ‌రే అదిరే బ‌ర్త్ డే గిఫ్ట్ అన్న సీఎం!

By:  Tupaki Desk   |   24 July 2019 4:49 AM GMT
రూ.101 మ‌నియార్డ‌రే అదిరే బ‌ర్త్ డే గిఫ్ట్ అన్న సీఎం!
X
ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి పుట్టిన‌రోజు.. అది కూడా మ‌హారాష్ట్ర లాంటి రాష్ట్రానికి సీఎం అంటే మాట‌లా? వేలాది బ‌హుమ‌తులు పుట్టిన‌రోజు వేళ అందుతాయి. అయితే.. అలా వ‌చ్చిన వాటిల్లోకెల్లా అత్యుత్త‌మ బ‌ర్త్ డే గిఫ్టు గురించి చెప్పిన దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఆయ‌న ప్ర‌భుత్వ ప‌నితీరును చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లైంది.

ఫ‌డ్న‌వీస్ 49వ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఒక నిరుపేద మ‌హిళ తాను దాచుకున్న పొదుపు మొత్తం నుంచి రూ.101 మ‌నియార్డ‌ర్ ద్వారా బ‌ర్త్ డే గిఫ్ట్ గా పంపిన వైనంపై ఆయ‌న భావోద్వేగానికి గుర‌య్యారు. ఇంత‌కీ.. సీఎంకు రూ.101 పంపిన ఆ నిరుపేద మ‌హిళ ఎవ‌రు? ఆమె ఎందుకీ మొత్తాన్ని సీఎం స‌హాయ‌నిధికి పంపింద‌న్న విష‌యంలోకి వెళితే.. గుండెల్ని త‌డిమే ఉదంతం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

మ‌హారాష్ట్రలోని అహ్మ‌ద్ న‌గ‌ర్ ప‌రిధిలోని చించోలి గ్రామానికి చెందిన రేణుక సాహిల్ గొందాలి దిన‌స‌రి కూలీ. సీఎం పుట్టిన రోజు సంద‌ర్భంగా రూ.101 సీఎం స‌హాయ నిధికి మ‌నియార్డ‌ర్ రూపంలో పంపారు. త‌న సోద‌రుడి కుమారుడ్ని ముఖ్య‌మంత్రి కాపాడినందుకు.. సీఎం మీద త‌న‌కున్న కృత‌జ్ఞ‌త‌ల్ని ఆమె అలా తీర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఒక లేఖ రాశారు. గ‌త ఏడాది త‌న సోద‌రుడు కుమారుడు ఐదేళ్ల వేదాంత భ‌గ‌వ‌త్ కు క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని.. వైద్యం కోసం వారి త‌ల్లిదండ్రులు ఎంతో ఖ‌ర్చు చేశార‌న్నారు. చివ‌రి ప్ర‌య‌త్నంగా అత‌డి ప‌రిస్థితి గురించి సీఎం కాల్ సెంట‌ర్ కు ఫోన్ చేసి.. వారి స‌మ‌స్య‌ను చెప్పిన‌ట్లు తెలిపారు.

త‌న ఫోన్ సందేశానికి స్పందించిన ముఖ్య‌మంత్రి.. ఆ బాలుడి వైద్య చికిత్స కోసం రూ.1.90ల‌క్ష‌ల వైద్య‌సాయాన్ని అందించార‌ని.. ఇప్పుడా బాబు కోలుకున్నాడ‌ని తెలిపింది. తాను పంపిన సందేశాన్ని సీరియ‌స్ గా తీసుకొని త‌న సోద‌రుడి కొడుకు జీవితాన్ని కాపాడినట్లు చెప్పారు. ఇదే సాయాన్ని ఇత‌రుల‌కు చేయాల‌ని తాను కోరుతున్నాన‌ని.. అందులో భాగంగా త‌న వంతుగా తాను దాచుకున్న మొత్తం నుంచి రూ.101 మ‌నియార్డ‌ర్ గా పంపుతున్న‌ట్లు తెలిపారు. దేవుడి ఆశీర్వాదం మీకెప్పుడూ ఉండాల‌న్న ఆకాంక్ష‌ను ఆమె వ్య‌క్తం చేశారు.

మ‌నియార్డ‌ర్ తో పాటు సీఎంకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల్ని తెలియ‌జేశారు. దీనిపై సీఎం త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆమె లేఖ‌ను.. ఆమె పంపిన మ‌నియార్డ‌ర్ వివ‌రాల్ని పోస్ట్ చేశారు. సీఎం స‌హాయ‌కుడు ఈ ఉదంతంపై స్పందిస్తూ.. పుట్టిన రోజున‌ ముఖ్య‌మంత్రికి ఎన్నో బ‌హుమ‌తులు వ‌చ్చినా.. ఒక మ‌హిళ నుంచి వ‌చ్చిన రూ.101 మ‌నియార్డ‌ర్ విలువ క‌ట్ట‌లేని బ‌హుమ‌తిగా సీఎం ఉద్వేగానికి గురైన‌ట్లు పేర్కొన్నారు. ఆ లేఖ ఆయ‌న హృద‌యాన్ని క‌దిలించిన‌ట్లుగా చెప్పారు.