Begin typing your search above and press return to search.

పవన్ అడ్డం తిరుగుతున్నాడా?

By:  Tupaki Desk   |   7 Feb 2018 5:30 PM GMT
పవన్ అడ్డం తిరుగుతున్నాడా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రెస్ మీట్ ఏపీ పాలిటిక్సు కొత్త మలుపులు తిరగబోతుందన్న సంకేతాలనిస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు - బీజేపీలకు మద్దతిచ్చిన పవన్ ఈసారి ఎన్నికల్లోనూ చంద్రబాబుకు మద్దతివ్వడం ఖాయమని ఇప్పటివరకు అంతా భావిస్తూ వస్తున్నారు. కొన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకిస్తున్న ఆయన చంద్రబాబును మాత్రం పల్లెత్తు మాటనడం లేదు. ఆయన్ను ఒక్క మాట కూడా ప్రశ్నించడం లేదు. కానీ, తాజా ప్రెస్ మీట్‌ లో మాత్రం ఆయన స్వరం మారింది. తొలిసారి చంద్రబాబుపై కాస్త పదునైన విమర్శలు చేశారు. అంతేకాదు... తాను ఎత్తుకున్న డిమాండ్లన్నీ గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలేనని ఆయన అనడం చూస్తుంటే పవన్ పొలిటికల్ గేమ్ ప్లాన్ మారుతున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణ పర్యటనలో అక్కడి పాలక టీఆరెస్ ను ప్రశంసించిన పవన్ అందరి నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఏ ఎండాకా గొడుగు పడుతూ పాలక పార్టీలకు ప్రచారం చేసుకునే రకమనే ముద్ర వేయించుకున్నారు. ఆ తరువాత అనంతపురం పర్యటనలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తూ వెళ్లిన ఆయన మళ్లీ ఈసారి కూడా చంద్రబాబు తోకగానే ఉంటానన్న సంకేతాలిచ్చారు. కానీ.. నిన్న ఆయన్ను మత్స్యకారులు కలిసినప్పుడు వారితో మాట్లాడుతూ ఎస్టీల్లో చేర్చాలన్న వారి డిమాండుకు మద్దతివ్వడం.. 21న వారికి మద్దతుగా శ్రీకాకుళం వస్తానని చెప్పడంతో పవన్ వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఆయన 2014లో కనీసం కొన్ని సీట్లకైనా పోటీచేసి ఉండాల్సింది అని వ్యాఖ్యానించడం.. ఇప్పటికే లేటు చేశామన్న భావన ఆయనలో ఉన్నట్లు చెప్తోంది. అంతేకాదు.. అప్పుడు చంద్రబాబు గెలుపులో తాను కీలకమయ్యానన్న విషయం ఆయన పక్కాగా గుర్తించినట్లు అర్థమవుతోంది.. అంతేకాదు.. అప్పుడే తన పార్టీకి ఎమ్మెల్యేలు ఉండుంటే - ఇప్పుడు మరింత ప్రబల శక్తిగా మారి ఉండేవాడినన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపిస్తోంది.

చంద్రబాబుకు తన అవసరం భారీగా ఉందని... తాను సొంతంగా సీఎం కుర్చీలో కూర్చునేంత బలవంతుడిని కాకపోయినా చంద్రబాబు అవసరం లేకుండానే ఏపీ రాజకీయాల్లో కీలకం కాగలనన్న విషయం పవన్ గుర్తించినట్లు చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన చంద్రబాబు కోసం కాకుండా జనసేనకు సొంత అస్తిత్వం కల్పించడం.. తాను స్వతంత్ర రాజకీయవేత్తగా ఎదగడంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ చంద్రబాబుకు దూరం జరిగి సొంత బలాన్ని నమ్ముకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.