పిడుగురాళ్లలో చోటు చేసుకున్న ఈ అమానుషం తెలిస్తే రక్తం మరుగుతుంది

Wed Jul 08 2020 13:30:02 GMT+0530 (IST)

railway employee let his dogs onto elder woman in Piduguralla

మానవత్వం అన్నది లేకుండా వ్యవహరించే దుర్మార్గులు కొందరు మన చుట్టూనే ఉంటారు. కానీ.. సమయం.. సందర్భం వచ్చినప్పుడు మాత్రం అలాంటి వారి గురించి తెలిసి షాక్ కు గురి అవుతుంటాం. తాజాగా చెప్పే ఉదంతం కూడా ఇలాంటిదే. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మరీ ఇంత ఆరాచకమా? అన్న భావన కలుగక మానదు. అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరిన డెబ్భై ఏళ్ల పెద్ద వయస్కురాలి మీద పిడుగురాళ్లకు చెందిన రైల్వే ఉద్యోగి వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది.పిడుగురాళ్లకు చెందిన భూక్యా రంజిత నాయక్ అనే రైల్వే ఉద్యోగి.. అవసరాల కోసం అమరావతి మండలం మద్దూరు గ్రామానికి చెందిన రామావత్ చంపల్లి అనే డెబ్భైఏళ్ల పెద్ద వయస్కులి వద్ద రెండేళ్ల క్రితం రూ.5లక్షల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. ఆమె తాజాగా ఆనారోగ్యానికి గురయ్యారు. దీంతో.. పది రోజుల క్రితం తాను ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని కోరుతూ వారింటికి వెళ్లారు.

అయితే.. తాను ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చటంతో పాటు.. పెద్ద వయస్కురాలిని ఇంటి నుంచి గెంటేశాడు.దుర్భాషలాడాడు. ఆమెపైకి తన పెంపుడు కుక్కల్ని వదిలాడు. దీంతో షాక్ తిన్న ఆమె.. తనపై జరిగిన దాడి గురించి తన బంధువులకు తెలియజేశారు. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించి.. విషయాన్ని వివరించారు. స్పందించిన పోలీసులు సదరు రైల్వే ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరితే మరీ ఇలా చేస్తారా? అంటూ పలువురువిస్మయానికి గురవుతున్నారు.