Begin typing your search above and press return to search.

గాంధీ ఫ్యామిలిలో సీఎం అభ్యర్థిగా ప్రియాంకే మొదటి వ్యక్తా ?

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:17 AM GMT
గాంధీ ఫ్యామిలిలో సీఎం అభ్యర్థిగా ప్రియాంకే మొదటి వ్యక్తా ?
X
గాంధీ ఫ్యామిలిలో సీఎం అభ్యర్థిగా చెప్పుకున్న మొట్టమొదటి వ్యక్తి ప్రియాంకా గాంధీయే. ఇప్పటివరకు గాంధీ ఫ్యామిలీ నుంచి ప్రధాన మంత్రులు అయిన వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రొజెక్టయిన వాళ్ళే ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూతో మొదలుపెడితే రాజీవ్ గాంధీ వరకు అందరూ ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళే. రాజీవ్ గాంధీ మరణం తర్వాత భార్య సోనియాగాంధీకి కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చింది.

అయితే వివిధ కారణాల వల్ల పీవీ నరసింహారావు ప్రధానమంత్రయ్యారు. మళ్ళీ 2014 ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా హైలైట్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఘోరంగా ఓడిపోయింది. దాంతో రాహుల్ కు అవకాశం మళ్ళీ దక్కలేదు. అలాంటిది ఇపుడు ప్రియాంక గాంధీ హఠాత్తుగా తానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధినంటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మీడియా సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన ముఖం కాకుండా ఇంకెవరైనా కనబడుతున్నారా అంటూ ఎదురు ప్రశ్నించారు. దాంతో యూపీలో కాంగ్రెస్ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అని ప్రియాంక పరోక్షంగా చెప్పినట్లయ్యింది. మరి ప్రియాంక సీఎం అవుతారా ? అవుతారా అంటే చాన్సే లేదని బల్లగుద్దకుండానే చెప్పచ్చు. యూపీలో కాంగ్రెస్ పార్టీ బాగా క్షీణ దశలో ఉంది. ఇప్పుడు పార్టీకి ఉన్న ఏడు ఎంఎల్ఏ స్థానాలు తిరిగి నిలబెట్టుకుంటే అదే పదివేలన్నట్లుగా ఉంది.

ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రీపోల్ సర్వేలో కాంగ్రెస్ కు ఐదు స్థానాలు వస్తే చాలా గొప్పని తేల్చాయి. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదన్న విషయం బాగా తెలుసు కాబట్టే ప్రియాంక జనాలకు గాలమేసినట్లే అనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషయాలను పక్కనపెట్టేస్తే ప్రియాంక గడచిన ఆరు మాసాలుగా యూపీలో పార్టీ కోసం కష్టపడుతున్నది వాస్తవం. ఆమె కష్టం ఫలిస్తే మహాఅయితే ఓ 10 సీట్లు వస్తాయేమో అనిపిస్తోంది. అందుకనే ప్రియాంక కూడా తానే సీఎం అభ్యర్థిని అంటు హింటిచ్చారు.